ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సీఎస్ సంజయ్ జాజూ సమీక్ష

Facebook
X
LinkedIn

జిల్లాల్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశం

హైదరాబాద్, :

రాష్ట్రంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలును పర్యవేక్షించిన నోడల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా గుర్తించిన సమస్యలు, సవాళ్లను సీఎస్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమం అమలులో ఎదురైన ఇబ్బందులతో పాటు, కొన్ని జిల్లాల్లో అమలు చేసిన వినూత్న విధానాల వల్ల సానుకూల ఫలితాలు సాధించిన విషయాన్ని వివరించారు.

ఈ సందర్భంగా సంజయ్ జాజూ మాట్లాడుతూ, జిల్లాల వారీగా ఎదురవుతున్న సమస్యలను జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. మంచి ఫలితాలు ఇచ్చిన విధానాలను ఇతర జిల్లాల్లో కూడా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రజా పాలన కార్యక్రమం మరింత సమర్థవంతంగా అమలయ్యేలా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

అనంతరం ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ 99 రోజుల కార్యక్రమానికి సంబంధించిన పురోగతిని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలోని వివిధ అంశాల కింద ఇప్పటివరకు సాధించిన విజయాలు, లక్ష్యాల సాధనలో నమోదైన పురోగతిని సమావేశంలో వెల్లడించారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, నోడల్ అధికారులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.