రొట్టెల పండగకు తొలిరోజు భక్తుల రద్దీ

Facebook
X
LinkedIn

నెల్లూరు :

నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగకు తొలి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల , ఎస్పీ అజిత వేజండ్ల, మున్సిపల్ కమిషనర్ నందన్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపట్టడంతో భక్తులందరూ సజావుగా దర్గాను దర్శించుకుని, రొట్టెలు మార్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. కోర్కెలు తీరిన వారు రొట్టెలను వదలడం… కోర్కెలతో వచ్చిన వారు ఆ రొట్టెలను స్వీకరించడం వంటి దృశ్యాలతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.

పటిష్ట బందోబస్తు

దర్గా ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, క్యూలైన్లు సజావుగా సాగేలా, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 1800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అవుట్ పోస్ట్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులను, వృద్ధులను వెంటనే సంబంధికులకు అప్పగిస్తున్నారు.

పారిశుద్ధ్య సిబ్బంది సేవలు భేష్

దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తా చెదరాన్ని తొలగిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. దర్గా ప్రాంగణాన్ని ఏడు జోన్లుగా విభజించి 6 వేలకు పైగా సిబ్బందితో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు సెప్టిక్ ట్యాంక్ వాహనాల ద్వారా శుభ్రపరుస్తున్నారు. దీంతో దర్గా పరిసరాలు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి.