తమిళనాడులో మరో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు

Facebook
X
LinkedIn

పీఎంకే రామదాస్ తో చేతులు కలిపిన  శశికళ

234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం

చెన్నై :

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో మరో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) వ్యవస్థాపకుడైన రామదాస్, దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన శశికళ దీని కోసం చేతులు కలిపారు.   మొత్తం 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని ఈ కూటమి యోచిస్తున్నది. విల్లుపురం జిల్లా తైలపురంలోని రామదాస్ నివాసానికి శశికళ వెళ్లారు. కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు గురించి సుమారు రెండు గంటల పాటు ఆయనతో చర్చించారు.కాగా, శశికళ సొంతంగా ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఐపీటీఎంఎంకే)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు రామదాస్‌ తెలిపారు. ‘ఈ పొత్తు ఇప్పటికే తమిళనాడులో బలమైన ప్రభావాన్ని చూపింది. పలువురు ప్రత్యర్థులను కలవరపరిచింది. మరిన్ని పార్టీలు మాతో చేరుతాయని భావిస్తున్నాం’ అని మీడియాతో అన్నారు. మొత్తం 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని తమ కూటమి యోచిస్తున్నదని వెల్లడించారు.మరోవైపు పీఎంకే వ్యవస్థాపకుడైన రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి రామదాస్‌ మధ్య పార్టీపై నియంత్రణ అంశంలో విభేదాలున్నాయి. అలాగే అన్నాడీఎంకేలో తన ప్రభావాన్ని తిరిగి పొందడానికి శశికళ పోరాడుతున్నారు. పార్టీని ఏకం చేయడంలో విఫలమైన తర్వాత తన సొంత పార్టీ ఏఐపీటీఎంఎంకేను ఆమె ఏర్పాటు చేశారు.అయితే తమ మాతృ పార్టీల్లో అంతర్గత సవాళ్లను ఎందుర్కొంటున్న రామదాస్‌, శశికళ రాజకీయ ప్రాబల్యం పునరుద్దరణ, తమ క్యాడర్‌ను పటిష్టం చేసుకోవడానికి ఈ పొత్తును ఒక మార్గంగా భావిస్తున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశారు. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనున్నది.