దేశ సంపద ప్రజలకే దక్కాలి.. కార్పొరేట్లకు కాదు

Facebook
X
LinkedIn

ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

హైదరాబాద్ :

దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రజలందరికీ సమానంగా అందే విధంగా ప్రభుత్వాలు విధానాలు అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో జరగనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రికను బుధవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశాన్ని పాలించే ప్రభుత్వాల ప్రధాన బాధ్యత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమేనని అన్నారు. ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, ప్రతి కుటుంబానికి అందుబాటు వైద్యం, రైతుకు గిట్టుబాటు ధర, కార్మికుడికి గౌరవప్రదమైన జీవనం, మహిళలకు భద్రత, ప్రజాస్వామ్య హక్కులకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు.

దేశ అభివృద్ధి అంటే కొద్దిమంది సంపద పెరగడం కాదని, ప్రజలందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, లౌకిక విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, శాస్త్రీయ దృక్పథం బలపడటమే నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించడం, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడం, విద్య, వైద్యాన్ని హక్కులుగా అమలు చేయడం, రైతు, కార్మిక, యువజన ప్రయోజనాలను కాపాడే విధానాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం అమలవుతున్న ఆర్థిక విధానాలు ప్రజల అవసరాల కంటే కార్పొరేట్ లాభాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచడం, శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్సహించడం, విద్య, వైద్యాన్ని వ్యాపారంగా మార్చడం, సహజ వనరులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

యాదగిరిగుట్టలో జరిగే రాష్ట్ర మహాసభల్లో ఉపాధి, విద్య, వైద్యం, యువజన సమస్యలు, ప్రజాస్వామ్య హక్కులు, ప్రజారంగ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర మహాసభలను యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు బిజ్జా శ్రీనివాసులు, లింగం రవి, నానాబాల రామకృష్ణ, టి. సత్యప్రసాద్, పేరబోయిన మహేందర్, శ్రీమాన్, యుగంధర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. బాలకృష్ణ, సల్మాన్ బేగ్, షేక్ మహమూద్, ఎల్లంకి మహేష్, పి. శివకుమార్, నయీమ్, రాజేష్, మధు, మానస్ కుమార్, రాజ్‌కుమార్, శేఖర్, చింతల రమేష్, శ్రీనివాస్, రాము, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.