తుంగభద్ర జలాల కోసం కేంద్ర జోక్యం కోరిన సీఎం

Facebook
X
LinkedIn

తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటిపై ఆందోళన
ఆర్డీఎస్‌ ఆధునికీకరణ, పూడికతీతకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం

హైదరాబాద్, :

తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నికర జలాల వినియోగం, భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కోరారు. తుంగభద్ర డ్యాం, నది ప్రవాహం నుంచి రాష్ట్రానికి 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఐదు నుంచి ఆరు టీఎంసీలకే పరిమితమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్‌) పరిధిలో ఉన్న దాదాపు 75 గ్రామాల రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని పేర్కొన్నారు.

బుధవారం సాయంత్రం జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్‌, అంతర్రాష్ట్ర జలవివాదాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, ఇరిగేషన్‌ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్‌, ఇరిగేషన్‌ కార్యదర్శి శ్రీధర్‌, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్‌తో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలి

తుంగభద్ర జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు వినియోగిస్తున్న నేపథ్యంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. మూడు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంలో పారదర్శకత, సమన్వయం పెరిగితేనే తెలంగాణకు రావాల్సిన వాటా జలాలు సమర్థంగా అందుతాయని అభిప్రాయపడ్డారు.