భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

Facebook
X
LinkedIn

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్ :

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని అన్ని శాఖల అధికారులు హై అలర్ట్‌లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్‌తో పాటు ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక కార్యదర్శి సహా ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.

వర్షాల కారణంగా నగరవాసులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక కూడళ్లు, లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.