నగరంలో మరో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టు రట్టు

Facebook
X
LinkedIn

సుమారు రూ.18.26 లక్షల విలువజేసే కల్తీ నెయ్యి ,తయారీ సామాగ్రిని స్వాధీనం

బంజారాహిల్స్ :

నగరంలో మరో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టు బట్టబయలయ్యింది. కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్(గోల్కొండ టీమ్),మాసబ్‌ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బంజారాహిల్స్ పరిధి భోలానగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ‘ప్రైడ్ డెయిరీ’ కల్తీ నెయ్యి తయారీ కేంద్రం వెలుగుచూసింది. సుమారు రూ.18.26 లక్షల విలువజేసే కల్తీ నెయ్యి మరియు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకుని తయారీకేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. భోలానగర్‌కు చెందిన జునైద్ హుస్సేన్ తన ప్రైడ్ డెయిరీ యూనిట్‌లో లైసెన్స్ కలిగి ఉన్నప్పటికీ అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ ఈ కల్తీ నెయ్యి కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తక్కువ నాణ్యత కలిగిన పామాయిల్,వనస్పతి(డాల్డా), ఇతర హానికరమైన పదార్థాలను ఆవు,గేదె మీగడలో కలిపి కల్తీ నెయ్యిని తయారు చేస్తుండటంతో సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. తయారు చేసిన ఈ కల్తీ నెయ్యిని అసలైన నెయ్యిగా నమ్మిస్తూ ప్రజలకు,హోటళ్లకు,శుభకార్యాల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. పోలీసులు తనిఖీల్లో రూ.18.26 లక్షల విలువజేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 460 కేజీల కల్తీ నెయ్యి, 70 కేజీల కల్తీ మిశ్రమ నెయ్యితో పాటు భారీస్థాయిలో కల్తీకి ఉపయోగించే 2090 కేజీల ఆవు మీగడ,1170కేజీల గేదె మీగడ స్వాధీనం చేసుకున్నారు. నగర అడిషనల్ డిసిపి(టాస్క్‌ఫోర్స్) అందె శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్ వెంకటేశ్,మాసబ్‌ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్,ఎస్‌ఐలు విజయానంద్,చందన తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.