అంధ విద్యార్థులకై ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ ప్రారంభం

Facebook
X
LinkedIn

నల్ల‌గొండ :

న‌ల్ల‌గొండ జిల్లాలో ప్ర‌ప్ర‌థ‌మంగా అంధ విద్యార్థులకై ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ సదుపాయాలను నల్ల‌గొండ జిల్లా గ్రంథాలయంలో ప్రారంభించడం గర్వకారణమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఏ ఆఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం నల్ల‌గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బ్లైండ్ (దృష్టి లోపం ఉన్న) పాఠకులు, విద్యార్థులకై ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ ను ఆయన ప్రారంభించారు. విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని, ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బ్లైండ్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, బ్రెయిలి పుస్తకాలు, ఆడియో బుక్స్, ఈ-బుక్స్, స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్లు, ప్రత్యేకంగా చదువుకునే విభాగం, సహాయక సాంకేతిక పరికరాలు ఉపయోగించుకోవాలని చెప్పారు.అనంతరం 2026–27 సంవత్సరానికి సంబంధించిన జిల్లా గ్రంథాలయ సంస్థ వార్షిక బడ్జెట్ సమావేశం గ్రంథాలయ సంస్థ చైర్మన్ అధ్యక్షతన జరిగింది. వార్షిక బడ్జెట్‌కు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ ద్వారా గ్రంథాలయాల అభివృద్ధి, పుస్తకాల కొనుగోలు, భవనాల మరమ్మతులు, డిజిటల్ లైబ్రరీ విస్తరణ, భద్రతా చర్యలు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలో అవసరమైన చోట పబ్లిక్ రీడింగ్ సెంటర్లు ప్రారంభిస్తామన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు గ్రంథాలయ సెస్ ను సకాలంలో చెల్లించాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రంథాలయాన్ని సమగ్ర జ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చైర్మన్ స్పష్టం చేశారు. విద్యార్థులు, పాఠకులు గ్రంథాలయాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.