చదువు అనేది గేమ్ ఛేంజర్.. సరైన సమయంలో నిర్ణయాలు ఉండాలి

Facebook
X
LinkedIn

అమరావతి :

మనం మాత్రమే కాదు.. సమాజం కూడా బాగుండాలనేది మన సంస్కృతి అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పిల్లలు ఎంత పెద్దవాళ్లయినా జీవితాంతం ఏ సహాయం కావాలన్నా అందించే సంస్కృతి మనది అని అన్నారు. రూ.100 కోట్లు ఖర్చు పెట్టి మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. గుంటూరు జిజిహెచ్ మాతా శిశు కేంద్రాన్ని సిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.. కళాశాల అభివృద్ధికి ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అనేక సేవా కార్యక్రమాలను ముందుకొచ్చి భారీగా విరాళాలు ఇస్తున్నారని, చైతన్యం పెరిగిందని.. సేవా కార్యక్రమాలకు చాలా మంది ముందుకొస్తున్నారని అన్నారు. జన్మభూమి కార్యక్రమానికి పిలుపు ఇవ్వగానే అభివృద్ధికి దోహదం చేశారని, ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని సూచించారు. చదువు అనేది గేమ్ ఛేంజర్.. సరైన సమయంలో నిర్ణయాలు ఉండాలని, భారతరత్నకు మారు పేరుగా దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉన్నత స్థితికి చేరుకుంటారని, ఆర్థిక అసమానతలు తగ్గాలి.. పేదరికం లేని సమాజం చూడాలి అని అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, పి4 కార్యక్రమానికి ముందుకు రావాలని అందరినీ కోరుతున్నానని ఆకాంక్షించారు. సంపాదనలో కొంతభాగం సమాజానికి వెచ్చించాలని, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ నాలుగో స్థానంలో ఉందని కొనియాడారు. 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని జోష్యం చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో భారత్ ఉండాలనేది మనందరి ఆకాంక్షని, స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారుచేశామని అన్నారు. హైదరాబాద్ కంటే మెరుగైన నగరం నిర్మించాలని, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీగా రూపొందుతుందని చెప్పారు. ఆనాడు ఐటి..ఇప్పుడు ఎఐ వచ్చిందని, అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు స్పష్టం చేశారు.