మొంథా తుపాను ప్రభావం.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

Facebook
X
LinkedIn

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల సూచన

హైదరాబాద్‌:

మొంథా తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాగల నాలుగు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించగా, ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లను వినియోగించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించేలా రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 4,428 కేంద్రాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 22,433 మంది రైతుల నుంచి 1,80,452 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, అవినీతి చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు కేంద్రాలను తరచుగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సూచించారు.