జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌.. కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశం

Facebook
X
LinkedIn

హైద‌రాబాద్  :

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా.. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం మొద‌లైంది.ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల, క్లస్టర్ల ఇంచార్జులు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నేతలు, స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర పార్టీ కీలక నేతలు హాజరయ్యారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. “కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం గుల్లగా మారింది. శాంతిభద్రతలకు మారుపేరైన హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం కొనసాగాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలి. మా పదేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ వచ్చాక కనుమరుగయ్యాయి” అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ దుష్టపాలన గురించి ప్రజలకు మరింతగా వివరించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

ఈ ఉప ఎన్నిక ఫలితం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. “జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిస్తే, ఆ గెలుపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారనే సంకేతాలు వెళతాయి. ఈ ఉప ఎన్నికలో మన విజయం ఖాయం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డి బరిలో ఉన్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.