మంత్రులు పొన్నం ప్రభాకర్‌   వివేక్‌పై   మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌   సంచలన ఆరోపణలు

Facebook
X
LinkedIn

హైదరాబాద్‌ :

కాంగ్రెస్‌  మంత్రుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తనను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్‌   వివేక్‌పై   మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌   సంచలన ఆరోపణలు చేశారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని, ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ వ్యాఖ్యానించారు. తాను పక్కనే కూర్చుంటే లేచి వెళ్లిపోవడమేంటని, సహచర మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటావా అని మంత్రి వివేక్‌ను నిలదీశారు. మాదగిలు అంటే అంత చిన్న చూపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి అడ్లూరి వీడియోను విడదల చేశారు.‘నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదు. నా వద్ద డబ్బులు లేవు. పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడు అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మంత్రిగా మూడు నెలల పొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం తప్పా?. నేను త్వరలోనే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ని కలుస్తా. నేను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. నేను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్‌’ అంటూ ప్రశ్నలు సంధించారు. దళితులు అంటే చిన్న చూపా? అని ప్రశ్నించారు. దీంతో, కాంగ్రెస్‌ పార్టీలో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.

ఆ దున్నపోతుగానికి ఏం తెలుసు ?..

‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ సహచర మంత్రిని ఉద్దేశించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్‌చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అందరూ వచ్చారు. కానీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకే చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్‌ చెవిలో గుసగుసగా ‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటుండగా మైక్‌ స్పీకర్లు ఆన్‌చేసి ఉండటంతో అది బయటకు వినిపించింది. అప్పటికే మీడియా కెమెరాల్లో అదంతా రికార్డయింది. మళ్లీ కొద్ది నిమిషాలకే ‘వస్తుండా? స్టార్ట్‌ అయినంక జాయిన్‌ అయితాడా?’ అంటూ మైనార్టీ నేతలను ఉద్దేశిస్తూ ‘మొదలు పెట్టండి’ అని ఆర్డర్‌ వేసినట్టుగా పొన్నం మాట్లాడారు.మరో మంత్రి లేకుండా ప్రెస్‌మీట్‌ ఎలా మొదలుపెడుతామని మెనార్టీ నేతలు సందిగ్ధంలో పడి వెనుకముందాడారు. దీంతో మరోసారి పొన్నం మైక్‌ అందుకొని ‘మీరు మాట్లాడుతారా? నన్ను మాట్లాడుమంటారా?’ అంటూ దబాయిస్తున్నట్టుగా మాట్లాడారు. ఇదంతా కెమెరాల్లో రికార్డయింది. మీడియా సమావేశం కవరింగ్‌ కోసం వచ్చిన యూట్యూబర్లు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టగా, నిమిషాల్లోనే వైరల్‌ అయింది. దీంతో నాలుక కరుచుకున్న పొన్నం ప్రభాకర్‌ ఖండన ప్రకటన చేశారు.