INDIA Bloc: చీలిక దిశగా ఇండియా కూటమి .. మమత నాయకత్వానికి పెరుగుతున్న మద్దతు

Facebook
X
LinkedIn

విపక్ష ‘ఇండియా’ కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ సారథ్యానికి క్రమంగా కాంగ్రెసేతర నేతల మద్దతు పెరుగుతోంది.

Eenadu icon

By National News Desk Updated : 11 Dec 2024 08:38 IST

దిల్లీ, పట్నా: విపక్ష ‘ఇండియా’ కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ (Mamata Banerjee) సారథ్యానికి క్రమంగా కాంగ్రెసేతర నేతల మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ సైతం తాజాగా ఈ జాబితాలో చేరడం గమనార్హం. ఎన్నికల్లో బెంగాల్‌కు వెలుపల గోవా, త్రిపుర, మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్‌ వంటి రాష్ట్రాల్లో టీఎంసీ ప్రభావం పెద్దగా ఏమీలేదంటున్న కాంగ్రెస్‌ అభ్యంతరాన్ని లాలూ తోసిపుచ్చారు. పట్నాలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా కూటమిని మమత నడపగలదు. ఆమెకు నాయకత్వం ఇవ్వాలి’’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకొన్న ఇండియా కూటమి ఆ తర్వాత జరిగిన హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోరంగా విఫలమవడంతో నాయకత్వ మార్పుపై భాగస్వాముల దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో అవకాశమొస్తే ఇండియా కూటమిని నడపడానికి తాను సిద్ధమని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) నేతలు ఆమెకు మద్దతుగా గళం విప్పారు. లాలూ తనయుడైన ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌ సైతం మమత సారథ్యంపై ఎటువంటి అభ్యంతరం లేదని, నిర్ణయం మాత్రం ఏకగ్రీవంగా ఉండాలన్నారు. ఇండియా కూటమి సారథ్యంలో మార్పుపై మిత్రపక్షాల్లోని కొందరు కిందిస్థాయి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై తొందరపడి ఎవరూ స్పందించవద్దని కాంగ్రెస్‌ ఎంపీలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కోరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మంగళవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో పార్టీ ఎంపీలతో సమావేశమైన రాహుల్‌ విపక్ష కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే సామర్థ్యం ఉన్నట్లు సర్దిచెప్పారు.