నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయిధ రైతాంగ తెలంగాణ పోరాటం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం కమలానగర్ సిఐటియు కాన్ఫరెన్స్ హాల్లో టి పి ఎస్ కే గౌరవాధ్యక్షులు రాములు రచించిన “తెలంగాణ పోరాట వారసత్వం” పుస్తకంపై స్టడీ సర్కిల్ జరిగింది. ఈ కార్యక్రమానికి పుస్తక రచయిత రాములు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సమన్వయకర్తగా స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు వ్యవహరించారు. ముందుగా సామాజిక ఉద్యమనేత జయరాజు పుస్తకంలో ఉన్న వివరాలను ప్రజెంటేషన్ చేశారు. అంతేకాకుండా శ్రీమన్నారాయణ రాసిన సమాచారాన్ని సభ్యులకు వివరంగా వివరించారు. రచయిత రాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం పుస్తకాన్ని ఏ నేపథ్యంలో రాయబడిందో తెలియజేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని తక్కువ చేసి చూపించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని తెలియజేయడం కోసం 2009లో రాశానని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆనాటి నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా నీ బాంచన్ కాల్ మొక్కుతా అన్న రైతాంగం బంధూకులు పట్టి పోరాడిన ఘన చరిత్ర అని తెలియజేశారు. ఆనాడు కోటిన్నర జనాభా కలిగిన తెలంగాణలో చదువుకున్న వారు ఐదు శాతం మంది ఉన్నారు. అది కూడా ఉర్దూ మీడియం లో ఉండేది. తెలుగును చిల్లర భాషగా చూసేవారు. తెలుగు భాషా ఉద్యమంలో భాగంగా ఆంధ్ర మహాసభ ఏర్పడింది. మరియు జమీందారులు జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాడిన వీర చరిత్ర ఆనాటిది. నిజాం సర్కార్ కింద ఈ జమీందారులు జాగిర్దారులు పన్ను చెల్లించి పూర్తిగా తమ పెత్తనంలో సాగించేవారు. ప్రజలను పీడించేవారు. వెట్టి చాకిరి చేయించేవారు. వాటికి వ్యతిరేకంగా తిరగబడిన చరిత్ర సంఘం పేరిట కమ్యూనిస్టులు దీర్ఘకాలం పోరాడి అనేక విజయాలు సాధించారని చెప్పారు. నెహ్రూ సైన్యం తెలంగాణను విలీనం చేసుకున్నప్పటికీ నిజాం సర్కార్ కు రాజ ప్రముఖ్ గా పట్టం కట్టి తిరిగి భూస్వాములకు అధికారం అప్ప చెప్పే ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా పోరాడి రైతాంగం భూములు రక్షించుకునే దిశలో విజయం సాధించారు. ముఖ్యంగా ఈ పోరాటానికి అటు కాంగ్రెస్ కానీ ఇటు బిజెపి గాని, టిఆర్ఎస్ గాని హక్కు లేదని అన్నారు. ఈ పోరాటం నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా జరిగినప్పటికీ హిందూ ముస్లింల కొట్లాటగా జరగలేదు. హిందువులు ముస్లింలు వివిధ సామాజిక తరగతులు అందరూ కలిసికట్టుగా కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాడారని చెప్పారు.

ఈ సందర్భంగా పై పుస్తకం పై కృష్ణమాచార్యులు, శివన్నారాయణ, రోజా రాణి, మల్లేశం, జయరాజు, గిరీష్, ఎం భాస్కర్ రావు, గుమ్మడి హరిప్రసాద్, శారద , కోమటి రవి , ఏకే దుర్గా చారి, ప్రభాకర్ , జి శివరామకృష్ణ , ప్రసంగించారు. గొడుగు యాదగిరి రావు మాట్లాడుతూ 2026 నాటికి తెలంగాణ సాయుధ పోరాటం 80 సంవత్సరాలు నిండుతాయి. ఈ సంవత్సర కాలమంతా తెలంగాణ సాయుధ పోరాట రూపాలను వివిధ రూపాలలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించడం జరిగింది. వ్యాసాలు, నాటికలు, షార్ట్ ఫిలిమ్స్, ఎగ్జిబిషన్లు వివిధ సాంస్కృతిక రూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించడం జరిగింది. చివరగా తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నినాదాలు చేస్తూ ముగించడం జరిగింది.