హైదరాబాద్ :
పదమూడేళ్ల క్రితం నమోదైన ఓ మహిళ మిస్సింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్యుల కేసుల్లో పోలీసులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు పురోగతిపై స్పష్టమైన అఫిడవిట్‌ను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నుంచి దాఖలు చేయాలని ఆదేశించింది. అవసరమైతే కేసును సీబీఐకి అప్పగించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
2012లో అదృశ్యం
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన బండారు ప్రకాశరావు కుమార్తె మంగాదేవి వివాహం మోహన్బ్రహ్మాజితో జరిగింది. అయితే 2012 అక్టోబరు 18న ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని భర్త ప్రకాశరావుకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన ప్రకాశరావు అదే రోజు తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఫలితం లేకున్నా ఫిర్యాదులు
అయితే కేసు నమోదు చేసి ఏళ్లు గడుస్తున్నా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రకాశరావు అనేక సార్లు అధికారులను ఆశ్రయించారు. సీఐడీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, మానవ హక్కుల కమిషన్లకు పలు వినతులు సమర్పించినా ఫలితం రాలేదు. చివరికి ఆయన 2017లో హైకోర్టును ఆశ్రయించారు.
పోలీసులపై కోర్టు ఆగ్రహం
ఇటీవల ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బట్టు దేవానంద్, కేసు ఫైళ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తులో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ నుంచి సమగ్ర అఫిడవిట్ వచ్చాక కేసును సీబీఐకి అప్పగించే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు వెల్లడించింది.