Nitish Kumar Reddy..! ఐపీఎల్ మెరుపులతో అందరి దృష్టినీ ఆకర్షించాడు ఆ తెలుగు కుర్రాడు. రెడ్ బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేని అతణ్ని బోర్డర్-గావస్కర్ సిరీస్‌కు ఎంపిక చేయడం మాత్రం అనూహ్యమే.

By Sports News Desk Updated : 11 Dec 2024 06:55 IST
ఈనాడు క్రీడావిభాగం

Nitish Kumar Reddy..! ఐపీఎల్ మెరుపులతో అందరి దృష్టినీ ఆకర్షించాడు ఆ తెలుగు కుర్రాడు. రెడ్ బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేని అతణ్ని బోర్డర్-గావస్కర్ (Border – Gavaskar Trophy 2024) సిరీస్‌కు ఎంపిక చేయడం మాత్రం అనూహ్యమే. కానీ సహచర బ్యాటర్లు తడబడుతున్న వేళ కంగారూలపై అదిరే బ్యాటింగ్‌తో ఔరా అనిపించిన నితీశ్ కుమార్‌రెడ్డి.. టెస్టు క్రికెట్ ఆడేందుకు తాను సంపూర్ణ అర్హుడినేని బలంగా చాటి చెప్పాడు. అతడి స్ట్రోక్ప్లేనే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం.
అదురు లేదు.. బెదురు లేదు. స్వేచ్ఛగా చెలరేగి పోతున్నాడు. క్రీజులో అలవోకగా కదులుతూ కళ్లు చెదిరే స్ట్రోక్ ప్లేతో అబ్బురపరుస్తున్నాడు. నితీశ్ (Nitish) ఆట చూస్తే ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 21 ఏళ్ల కుర్రాడంటే ఎవరూ నమ్మరు. గావస్కర్ (Sunil Gavaskar) వంటి దిగ్గజమే అతడి ఆటకు ఫిదా అయిపోయాడు. ఏం ఆత్మవిశ్వాసమది. స్టార్క్, కమిన్స్ లాంటి బౌలర్లను సైతం లెక్క చేయకుండా.. ఎటాకింగ్ గేమ్‌తో జట్టుకు విలువైన పరుగులు అందిస్తున్నాడు. అడిలైడ్‌లో నితీశ్ ఆడిన ఓ షాట్.. అతడి నైపుణ్యానికి, నిర్భీతికి ఓ మచ్చుతునక.
పదునైన ఆసీస్ పేస్ (AUS vs IND) బౌలింగ్‌కు మిగతా భారత బ్యాటర్లు నిలవలేకపోయిన వేళ.. బోలాండ్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌తో నితీశ్ కొట్టిన సిక్స్‌కు ఆస్ట్రేలియా వ్యాఖ్యాతలు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. షాట్‌కు ముందే సిద్ధమైన నితీశ్ సూపర్‌గా కనెక్ట్ చేయడంతో బంతి థర్డ్‌మాన్ మీదుగా వెళ్లి స్టాండ్స్‌లో పడింది. భారత మాజీ క్రికెటర్లు, అభిమానుల ప్రశంసలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఇదొక్కటే కాదు.. సాధికారికంగా ఇలాంటి షాట్లు చాలానే ఆడాడు నితీశ్. సిరీస్‌లో ఇప్పటివరకు 54.33 సగటుతో 163 పరుగులు చేశాడు. ఇందులో 18 బౌండరీలు, ఏడు సిక్స్‌లు ఉన్నాయంటే అతడి స్ట్రోక్ ప్లే ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పేస్ బౌలర్ల బౌలింగ్‌లో ఆరు సిక్స్‌లు బాదేశాడు.
ఆస్ట్రేలియాలో పేస్ బౌలింగ్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన మొదట భారత బ్యాటర్‌గా నితీశ్ నిలవడం విశేషం. ఇంకెవరూ కూడా మూడు కంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టలేదు. తొలి మూడు టెస్టుల్లో భారత్ 150, 180, 175కు ఆలౌటైన ఇన్నింగ్స్‌ల్లో నితీశ్ 41, 42, 42 పరుగులు చేశాడు. ఈ మూడింట్లోనూ అతడే టాప్ స్కోరర్. టాప్ స్కోరర్ కాని మరో ఇన్నింగ్స్ (487/6 డిక్లేర్డ్)లో అతడు 38 (27 బంతుల్లో) పరుగులతో అజేయంగా నిలిచాడు. మంచి టైమింగ్, బలంతో అతడు కొట్టే షాట్లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముందుకొచ్చి ఆడడం, రివర్స్ స్వీప్స్, అప్పర్ కట్స్.. ఇలా ఈ తెలుగు కుర్రాడి అమ్ముల పొదిలో ఎన్ని షాట్లో!
పెర్త్‌లో మొదలైంది నితీశ్ (Nitish Kumar Reddy) ముచ్చటైన విధ్వంసం. వేగంగా పరుగులు చేయడం అవసరమని అర్థమై లైయన్ బౌలింగ్‌లో తొలి ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు కొట్టాడు. ఒకటి నేరుగా.. రెండోది కవర్లో, మూడోది రివర్స్ స్వీప్‌తో. రెండో టెస్టులో కూడా నితీశ్ ఆహా అనిపించాడు. స్టార్క్ మంచి లెంగ్త్‌తో వేస్తున్నా సరే.. బంతి కాస్త దూరంగా పడ్డా నితీశ్ వదల్లేదు. స్టార్క్ బౌలింగ్‌లో లాఫ్టెడ్ డ్రైవ్‌తో నితీశ్ కొట్టిన సిక్స్‌ను చూసి తీరాల్సిందే. మిగతా భారత బ్యాటర్లలా కాకుండా క్రీజు లోపల ఉండి ఆడడం నితీశ్ జోరుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
‘‘ఒక యువ ఆటగాడు ఇంత తక్కువ సమయంలో చేయగలిగిందంతా నితీశ్ చేశాడు. అతడు ఇంకా చాలా ఎత్తుకు ఎదుగుతాడు’’ అని అని టీమ్ఇండియా సహాయ కోచ్ డస్కాటె వ్యాఖ్యానించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న నితీశ్ ఇప్పుడు జట్టుకు విలువైన ఆస్తిగా మారాడు. ఈ ఆల్‌రౌండర్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందనడంలో సందేహం లేదు.
‘‘రానున్న రోజుల్లో నితీశ్ తప్పక ఆరో స్థానంలో వస్తాడు. జట్టుకు గొప్ప సమతూకాన్నిస్తాడు. బ్యాటింగ్ ఆర్డర్లో అతడు ఇంకా ముందొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అన్నది ఆస్ట్రేలియా దిగ్గజం గిల్‌క్రిస్ట్ అభిప్రాయం. ఆడింది రెండు టెస్టులే అయినా అసాధారణ ఆటతో నితీశ్ (Nitish Kumar Reddy) అందరి మెప్పును పొందుతున్నాడు. ఇదే నిలకడను కొనసాగిస్తే.. టీమ్ఇండియాలో అతడు కీలకంగా మారడానికి ఎంతో సమయం పట్టదు.