Mohammed Shami: ‘బుమ్రా ఎక్కువ వికెట్లు పడగొట్టినా షమినే భారత అత్యుత్తమ బౌలర్‌’

Facebook
X
LinkedIn

టీమ్ఇండియా సీనియర్ బౌలర్‌ మహ్మద్ షమి (Mohammed Shami)పై వెస్టిండీస్‌ దిగ్గజ పేసర్‌ ఆండీ రాబర్ట్స్‌ (Andy Roberts) ప్రశంసలు కురిపించాడు.

Eenadu icon

By Sports News Team Updated : 10 Dec 2024 12:23 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సీనియర్ బౌలర్‌ మహ్మద్ షమి (Mohammed Shami)పై వెస్టిండీస్‌ దిగ్గజ పేసర్‌ ఆండీ రాబర్ట్స్‌ (Andy Roberts) ప్రశంసలు కురిపించాడు. షమి భారత అత్యుత్తమ బౌలర్‌ అని కితాబిచ్చాడు. ‘షమి కొంతకాలంగా భారత అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. అతను జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) పడగొట్టినన్ని వికెట్లు సాధించలేకపోవచ్చు. కానీ, షమి దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి. మిగిలిన బౌలర్లతో పోలిస్తే అతనిలో నిలకడ ఎక్కువ. షమి బంతిని స్వింగ్, సీమ్ చేస్తాడు. బుమ్రా వలె బంతిపై మంచి నియంత్రణ ఉంది’ అని ఆండీ రాబర్ట్స్‌ పేర్కొన్నాడు.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బుమ్రా తర్వాత ప్రధాన పేసర్‌గా ఉన్న మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) గురించి కూడా విండీస్ మాజీ పేసర్ మాట్లాడాడు. షమి స్థాయికి సిరాజ్‌ దరిదాపుల్లో కూడా లేడన్నారు. బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగే మూడో టెస్టులో షమిని ఆడించాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. బుమ్రా ఇప్పటివరకు 42 టెస్టుల్లో 185 వికెట్లు పడగొట్టగా.. షమి 64 టెస్టుల్లో 229 వికెట్లు సాధించాడు. 

మరోవైపు, షమి అంతర్జాతీయ పునరాగమనంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. గాయం కారణంగా సుదీర్ఘకాలం ఆటకు దూరమై, దేశవాళీలో పునరాగమనం చేసిన షమి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ముస్తాక్‌ అలీ టోర్నీలో 34 ఏళ్ల షమి 16 రోజుల వ్యవధిలో 8 మ్యాచ్‌లు ఆడాడు. అయితే షమి ఇంకా టెస్టు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించలేదన్నది బీసీసీఐ వర్గాల సమాచారం. అతడు ఫిట్‌నెస్ సాధిస్తే ఆసీస్‌తో చివరి రెండు టెస్టుల్లో ఆడించాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.