ఓజోన్ పొర క్షీణతతో జీవరాశులకు ముప్పు 

Facebook
X
LinkedIn

      డాక్టర్  భారత రవీందర్.. సైన్స్ రచయిత  పర్యావరణ నిపుణుడు

హైదరాబాద్ :

ఓజోన్ అనేది ఆక్సిజన్ యొక్క ప్రత్యేక రూపం . ఇది మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడిన ప్రత్యేకమైన వాసన కలిగిన   రంగులేని వాయువు .   భూవాతావరణంలో    స్ట్రాటోస్పియర్ పొరలో ఉండే  ఓజోన్ వాయువు పొర అతినీలలోహిత కిరణాలను శోషించుకొని భూమిపై గల సమస్త జీవరాశిని కాపాడుతుంది . అందుకే ఓజోన్ పొరను భూమి కవచం లేదా భూమి గొడుగు అంటారు . ఇది నీటిలోని సూక్ష్మ క్రిములను చంపడానికి గాలిని శుభ్రపరచడానికి ఆహారపదార్థాల రంగును పోగొట్టడానికి ఆహారనిల్వలలో బ్యాక్టీరియ పెరుగకుండా కూడా  ఉపయోగపడుతుంది .  ఈ పొర కనుక లేకుంటే  అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడి సమస్తజీవులు నశించిపోతాయి  . మొక్కలలో పలు రకాల తెగుళ్ళు కలుగుతాయి .  మానవునిలో చర్మ రోగాలు కంటి సమస్యలు అస్తమా   కాన్సర్ శ్వాశకోశ వ్యాధులు , సంతాన సాఫల్యత తగ్గటంతో పాటు   జీవ వైవిధ్యనష్టం కలుగుతాయి .   నానాటికి పెరుగుతున్న మానవుడి పర్యావరణ విధ్వంసక చర్యల వల్ల కలిగే భూతాపంతో భూమి అగ్నిగోళంగా  మారి ఓజోన్ పొర దెబ్బ తింటున్నది .ఈ సమస్యలకు తోడు అంతరిక్ష ముప్పులు కూడా ఓజోన్ సంరక్షణకు కొత్త సవాలుగా మారుతున్నాయి.ఈ క్రమంలో భూమిపై సకల జీవుల సంరక్షణకు  ఓజోన్ పొర పరిరక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి  ప్రజల్లో అవగాన కల్పించడానికి కెనడాలో 16 సెప్టెంబర్1987 న జరిగిన  మాంట్రియల్ ప్రోటోకాల్  ఒప్పందం జ్ఞాపకార్థం  ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం  ( వరల్డ్ ఓజోన్  డే )  ప్రతి సంవత్సరం 16 సెప్టెంబర్ న జరుపుకోవాలని  1994 లో జరిగిన యూయన్ఓ  సాధారణ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించబడింది . గత సంవత్సరం 2024 లో మాంట్రియల్ ప్రోటోకాల్ : అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనే  నినాదంతో ఓజోన్ దినోత్సవంను  జరుపుకొన్నాము . 2025 లో జీవానికి ఓజోన్ (  ఓజోన్ ఫర్ లైఫ్ )  అనే ఇతివృత్తం తో జరుపుకుంటున్నాము . నలబై సంవత్సరాలుగా కొనసాగుతున్న  ఓజోన్ పోర సంరక్షణ మరియు నిబద్దత చర్యలను   ఈ థీమ్ నొక్కిచెబుతుంది . ఈ రోజు  ప్రపంచవ్యాప్తంగా సైన్స్ నుండి గ్లోబల్ యాక్షన్ నినాదం ద్వార శాస్త్రీయ అవిష్కరణలను ప్రపంచవ్యాప్త కార్యాచరణగా మార్చడం వాతావరణమార్పులు  ఓజోన్ క్షీణత-పర్యవసానాలు చెట్లపెంపకం గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి . 

    ఓజోన్ క్షీణతకు కారణాలు    :

పారిశ్రామిక విప్లవం కారణంగా  మానవుని  స్వార్థపూరిత వికృత చర్యల వలన   ఆధునిక జీవనశైలితో ప్రకృతి  పర్యావరణం దెబ్బతినడం తీవ్రతరమైంది . ఎయిర్ కండిషన్స్  , రిఫ్రిజిరేటర్  ప్లాస్టిక్  ఫోమ్స్  దోమలను నాశనం చేసే కాయిల్స్ , జెట్ బిళ్ళల అపరిమిత వినియోగం , డిటర్జెంట్ల ఉత్పత్తుల వల్ల ఏర్పడే క్లోరోఫ్లోరోకార్భన్లు  క్లోరోఫ్లోరోమిథేన్ , ఒలటైల్ఆర్గానిక్ సమ్మేళనాలు , హలోకార్భన్లు హైడ్రోకార్భన్లు  ఏరోసాల్స్ పెస్టిసైడ్స్ఓజోన్ పొరను ద్వంసం చేస్తున్నాయి . అడవుల తగ్గింపు  భూవినియోగంలో మార్పులు  గ్రీన్ హూస్ వాయువుల ఉద్ఘారాలు ఇ-వేస్టేజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం రేడియేషన్ కాలుష్యం తదితరాలు భూమిని కలుషితం చేస్తున్నాయి . దీని కారణంగా ఓజోన్ దెబ్బతిని పలుచబడుతున్నది . 1975 లో మొట్టమొదటి సారిగా అంటార్టికా ప్రాంతంలో ఓజోన్ పొర క్షీణించినట్లు శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా  గుర్తించారు . ఈ సమస్యలకు తోడుగా అంతరిక్ష రాకెట్లలో ఉపయోగించే క్లోరిన్ అల్యూమినియం ఆక్సైడ్ లు ఓజోన్ అణువులను విచ్చిన్నం చేస్తున్నాయి . వేల సంఖ్యలో తిరుగుతున్న ఉపగ్రహాలు రాకెట్ భాగాలు  చివరికి అంతరిక్ష వ్యర్దాలుగా దహనం చెంది నైట్రస్ ఆక్సైడ్ లు క్లోరిన్ లు విడుదలై ఓజోన్ ను తగ్గిస్తున్నాయి . సూర్యుడి నుండి వచ్చే సోలార్ ఫ్లేర్స్ కాస్మిక్ కిరణాలు  ఓజోన్ క్షీణతకు కారణమవుతున్నాయి . అంతరిక్ష పరిశోధనలో రాకెట్ల ఇంధనాల వలన ఉత్పత్తి అయ్యే గ్రీన్ హౌస్ వాయువులు ఓజోన్ పొరను బలహీనపరుస్తున్నట్లు పలుపర్యావరణ పరిశోధనలు తెలియజేస్తున్నాయి . కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్విస్ నివేదిక-21  ప్రకారం అంటార్టికా ప్రాంతంలో 1974 నుండి 2021 వరకు 75 శాతం ఓజోన్ పోర దెబ్బ తింటున్నట్లు  అంచనా .  ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాలతో పాటు  ఫర్ ఎవర్ కెమికల్స్  వంటి   పదార్థాలను నియంత్రించాలని  తాజాగా 2024 జులై 8 -12 తేదిలలో కెనడాలోని మాంట్రియల్ లో జరిగిన 46 వ పార్టిస్ టు ది మాంట్రియల్ ప్రోటోకాల్ ఓపెన్ ఎండెడ్ వర్కింగ్ గ్రూప్ సమావేశం పేర్కొనడం గమనార్హం .. 

                         ఓజోన్ సంరక్షణలో భారత్ ముందడుగు  :

  ఓజోన్ పొర రక్షణలో   మన దేశంతో పాటు  ప్రపంచ దేశాలు  కూడా  ఎంతగానో   కృషి చేస్తున్నాయి  .  2030 నాటికీ అభివృద్ధి  చెందిన దేశాలు 2040 నాటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలు  వియన్నా కన్వెన్షన్ తీర్మానం -1985 అంశాలు  అమలు పరచాలని నిర్ణయించాయి  . క్లోరోఫ్లోరోకార్బన్లను తగ్గించేందుకు 197 దేశాలు కుదుర్చుకొన్న మాంట్రియాల్ ప్రోటోకాల్- 1987 ఒప్పందం ప్రపంచంలో ఒక విజయవంతమైన పర్యావరణ ఒప్పందంగా  గుర్తింపు పొందింది  . కిగాలీ-2016 సవరణ ఒప్పందంలో హైడ్రో ఫ్లోరో కార్బన్లను తగ్గించాలని నిర్ణయించడం పర్యావరణ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలిచింది . ప్రపంచ దేశాలు అమలు పరుస్తున్న పర్యావరణహిత కార్యక్రమాల వల్ల   2045 నాటికి ఆర్కిటిక్ ప్రాంతంలో 2066 నాటికి అంటార్టికా ప్రాంతంలో ఓజోన్ పొర పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని యూఎన్ఓ పర్యావరణ కార్యక్రమం  తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి . ఓజోన్ సంరక్షణలో అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా మనదేశం  2047 నాటికి  వికసిత్ భారత్ కలను  సాకారం చేసుకోవడానికి  అనేక పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టి అమలు పరుస్తున్నది .  భారత ప్రభుత్వం ఓజోన్ డిప్లెషన్ నిరోధక ప్రోగ్రాంను అమలు చేస్తున్నది . అనేక ఎకోఫ్రెండ్లీ టెక్నాలజీ పథకాలను ప్రోత్సహిస్తున్నది . క్లోరో ఫ్లోరో కార్బన్ లు హలోన్స్ హెచ్సిఎఫ్ సి-14 బి ,  కార్బన్ టెట్రాక్లోరైడ్  వంటి పదార్థాల వియోగం నిలిపివేసింది . 2030 నాటికి హెచ్ సి ఎఫ్ సి పూర్తిగా నిర్మూలన జరుగుతుందని అంచనా వేయబడింది . 2021 లో మనదేశం కిగాలి సవరణకు ఆమోదం తెలిపింది . 2045నాటికి హెచ్ ఎఫ్ సి ల వినియోగాన్ని 85  శాతం తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది . ప్రపంచం లోనే మొట్టమొదటి సారిగా తక్కువ శితలీకరణ అవసరాలు పర్యావరణహిత సాంకేతికాలు సహజ రిఫ్రిజిరేటర్లలను  ప్రోత్సహించే దిశగా ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది . సౌరశక్తితో నడిచే శీతలికరణ పరికరాలపై పరిశోధనలు ముమ్మరంచేసి గ్రీన్ కూలింగ్ విప్లవంను సృష్టించింది . శక్తి సామర్థ్యం ఎలెక్ట్రిక్ వాహనాలు గ్రీన్ హైడ్రోజన్ నెట్ జీరో- 2070 లక్ష్యాలతో ఓజోన్ సంరక్షణను సమన్వయం  చేసి  వికసిత్ భారత్ దిశగా ముందుకు  పయనిస్తుంది .  ఓజోన్ సంరక్షణలో  ప్రభుత్వాలతో  పాటుగా పౌర సమాజం  మరింత చిత్తశుద్దితో  కృషి చేయవలసిన అవసరం  ఉంది .    ఓజోన్ పొరను మనం కాపాడితే  అది మనల్ని కాపాడుతుంది అనే తాత్విక చింతనతో సకల జీవరాశుల ప్రకాశవంతమైన  భవిష్యత్తు కోసం పర్యావరణహిత హరితజీవనం ( గ్రీన్ లివింగ్ )  గడపటానికి మానవుడి ప్రవర్తనలో సానుకూల మార్పులు రావాలి  .  అప్పుడే భవిష్యత్ తరాలకు  ఆరోగ్యకరమైన సురక్షితమైన  భూమిని అందించగలం    వ్యాస రచయిత :

 డాక్టర్  భారత రవీందర్