నవోదయ ఇండస్ట్రియల్ అసోసియేషన్ వినతి
చర్లపల్లి :
చర్లపల్లి డివిజన్లోని నవోదయ నగర్ ని ఇండస్ట్రియల్ జోనులోకి మార్చాలని నవోదయ ఇండస్ట్రియల్ అసోసియేషన్ కోరుతున్నారు. బుధవారం అసోసియేషన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో నవోదయ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జే. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకొని ఉన్న 33 ఎకరాలలో నవోదయ హౌసింగ్ కాలనీలో 2007 నుండి 200 కు పైగా చిన్న తరహా పరిశ్రమలు నిర్వహిస్తూ దాదాపు నాలుగు వేల మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చేలుస్తున్నామని కానీ మా ప్రాంతానికి మాత్రం ఎటువంటి గుర్తింపు లేకుండా పోయిందని ఆయన వివరించారు. ఇప్పటివరకు పలుమార్లు మంత్రులను అధికారులను కలిసి నవోదయ నగర్ ని పారిశ్రామిక జోనుగా మార్చాలని విన్నవించుకున్నామని తెలిపారు. 2020 సంవత్సరంలో రెగ్యులరైజ్ చేయాలని జీవో ఇచ్చారని కానీ ఆ జీవోలో నవోదయ నగర్ ని ఎవరు రెగ్యులరైజ్ చేయాలో చెప్పలేదన్నారు. అందువల్ల ఇటు జిహెచ్ఎంసి, ఐలా ఎవరు ముందుకు రావడం లేదని వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఐలా నిబంధనల ప్రకారం ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా గుర్తించాలని కోరారు.
ఇటీవల ఒక కంపెనీలో పట్టుబడ్డ డ్రగ్స్ విషయంలో నవోదయ ఇండస్ట్రియల్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
విలేకరుల సమావేశంలో నవోదయ ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ నారాయణరెడ్డి, కార్యదర్శి జే. ఆనంద్ కుమార్, ఉపాధ్యక్షులు కే సాయి రామ్ , సహాయ కార్యదర్శి సిహెచ్ సుధాకర్ రెడ్డి, కోశాధికారి వీ మురళీకృష్ణ, కమిటీ సభ్యులు వి శేఖర్, ఏ మోహన్ రెడ్డి, షేక్ మసూద్, పి వెంకటేశ్వరరావు, ఎం రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.
