న్యూ డిల్లీ :
నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాది మంది జనరేషన్ జెడ్ ఆందోళనకారులు సోమవారం దేశ రాజధాని కాఠ్మాండులో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. ఈ నిరసనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు నేపాల్‌లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నిన్నటి నుంచి నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. రాజధాని కాఠ్మాండు సహా అనేక నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. నేపాల్‌లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడి అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని ప్రకటనలో తెలిపింది.