రాజ్యాంగం సవరించాల్సిందేనని పిలుపు
కేరళ :
దేశంలో శాసనసభ ఎన్నికలకు పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక డిమాండ్ చేశారు. ఆదివారం కేరళలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఎంపీ మెరిట్ అవార్డ్స్–2025’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
“21 ఏళ్లకే ఐఏఎస్ అధికారి జిల్లాలను పాలిస్తున్నప్పుడు.. అదే వయసులో యువత ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయకూడదు? దీని కోసం రాజ్యాంగ సవరణ తప్పనిసరి” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించిన దాన్ని గుర్తు చేశారు.
2026 కేరళ అసెంబ్లీ ఎన్నికలు, 2029 దేశ భవిష్యత్తు దిశ నిర్దేశం చేస్తాయని సీఎం స్పష్టం చేశారు. “కాంగ్రెస్‌కి డబ్బు, అధికారం, మీడియా మద్దతు లేకపోయినా ప్రజల నమ్మకం ఉంది. యువతే మా బ్రాండ్ అంబాసిడర్లు” అని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడుస్తోందని, అందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బీజేపీ యువత హక్కులను కాలరాస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. “దేశంలో మార్పు తీసుకొచ్చే శక్తి యువతలోనే ఉంది. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే యువత లక్ష్యం కావాలి” అని పిలుపునిచ్చారు.