అమరావతి :
నెల్లూరు రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోలును తిరస్కరించిన హోం శాఖ జాయింట్ సెక్రటరీని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. కేవీ కిశోర్ కుమార్‌ను హోం శాఖ నుంచి ఇంధన శాఖకు బదిలీ చేసినట్లుగా వైసీపీ పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో జీవో కాపీని పోస్టు చేసింది.జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోలు కోసం టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సుధీర్ రెడ్డి, పాశం సునీల్‌కుమార్‌లు సిఫారసు చేశారు. కానీ వారి సిఫారసు లేఖలను జూలై 16వ తేదీన హోం శాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. ఈ పరిణామంతో హోంమంత్రి అనిత రంగంలోకి దిగి ఒత్తిడి తీసుకురావడంతో శ్రీకాంత్‌కు పెరోలు మంజూరు చేసినట్లు ఇప్పటికే వైసీపీ వెల్లడించింది. ఇదిలా ఉంటే అప్పుడు పెరోలు తిరస్కరించిన హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిశోర్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేశారు. ఆయన్ను హోం శాఖ నుంచి ఇంధన శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని వైసీపీ తమ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపింది.శ్రీకాంత్‌కు జైలు అధికారుల మెమోఇదిలా ఉంటే.. ప్రియురాలు అరుణతో సన్నిహితంగా ఉన్న వీడియోపై శ్రీకాంత్‌కు జైలు అధికారులు మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్‌కు పెరోలు ఇవ్వకముందు.. వైద్యం కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అతని ప్రియురాలు అరుణ ఆస్పత్రికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో శ్రీకాంత్ సన్నిహితంగా ఉన్న వీడియో ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ పెరోలును రద్దు చేశారు. ఇప్పుడు ఆ వీడియోపై వివరణ కోరుతూ శ్రీకాంత్‌కు జైలు అధికారులు మెమో పంపించారు.