వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పరోక్షంగా తీవ్ర విమర్శలు
తిరుపతి :
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని తెలిపారు. ఈ కుంభకోణానికి అవినీతిలో అనకొండలాంటి అధికారిణే కారణమని ఆరోపించారు.ఆ ఐఏఎస్ అధికారిణి గతంలో మంత్రులను కూడా పూచికపుల్లల్లా చూసిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తన శాఖకు సంబంధించిన మంత్రులను లెక్క కూడా చేయలేదని తెలిపారు. డబ్బు సంపాదనే తప్ప.. ఏ నైతిక విలువ లేని మనిషి అని మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ తాటకిలా కింది అధికారుల పట్ల ఆమె వ్యవహరించేవారని విమర్శించారు.తిరుపతిలో రోడ్లు వేస్తున్న సమయంలో టీడీఆర్ బాండ్ల ద్వారా వందల కోట్లు దోచుకోవాలని ఆ అధికారిణి ప్రయత్నించిందని భూమన ఆరోపించారు. అప్పుడు ఆ అవినీతిని అడ్డుకున్నామని తెలిపారు. దీంతో ఇది తట్టుకోలేకనే నెల్లూరు జిల్లా రైతుకు సమాచారం లీక్ చేసి.. రూ. రెండు వేల కోట్లు దోచుకున్నారంటూ ప్రచారం చేయించిందని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా తాము అవినీతి చేయలేదని.. అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే ఏ శిక్షకైనా రెడీ అని ప్రకటించారు. టీడీఆర్ బాండ్ల విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు.ఆ ఐఏఎస్ అధికారిణి 35 ఏండ్లలోనే రూ.వందల కోట్లు లూటీ చేసిందని భూమన ఆరోపించారు. రోజూ లక్షన్నర చీర కట్టే ఆ అవినీతి అధికారిణి జీతమెంత అని ప్రశ్నించారు. ఆమె దగ్గర వేల రూపాయల విలువ చేసే 11 విగ్గులు ఉన్నాయని చెప్పారు. నీతిగా నిజాయితీగా ఉండే తనపై కక్షగట్టి అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి తిరుపతిని అభివృద్ధి చేశామని తెలిపారు.