సుధాకర్ రెడ్డి మరణం పట్ల చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ :
ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. సుధాకర్ రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాననని రేవంత్ తెలిపారు.అనునిత్యం ప్రజల గురించి ఆలోచించి వారికోసమే పని చేసే సుధాకర్ రెడ్డి ఇక లేరు అంటే నమ్మలేకపోతున్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు. సమకాలీన రాజకీయ నాయకుడిగా ఆయనతో కలిసి పని చేసిన రోజులు గుర్తుకువస్తున్నాయన్నారు. కమ్యూనిస్టు పార్టీలో అంచెలంచలుగా ఎదిగి సిపిఐ జాతీయ కార్యదర్శి స్థాయికి చేరారని కొనియాడారు. ఏ పదవిలో ఉన్నా విలువలతో రాజీపడకుండా పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళి అర్పిస్తున్నానని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు వ్యక్తం చేశారు.