ఒకరిమీద ఒకరు ఆధారపడకుండా.. వ్యక్తిగతంగా జీవించడం కాదు
ఎవరైనా వ్యక్తిగతంగా జీవించాలనుకుంటే, వైవాహిక బంధంలోకి వెళ్లకూడదు
స్పష్టం చేసిన సుప్రీం కోర్ట్
న్యూఢిల్లీ :
పెళ్లి అంటే ఒక్కటిగా కలిసి జీవించడం అని, ఒకరిమీద ఒకరు ఆధారపడకుండా.. వ్యక్తిగతంగా జీవించడం కాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. వేర్వేరుగా జీవిస్తున్న భార్యాభర్తల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పెళ్లి చేసుకున్న జంట.. భాగస్వామి మీద ఆధారపడకుండా, వ్యక్తిగతంగా ఉంటానని చెప్పడం సరికాదు అని కోర్టు తెలిపింది. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా జీవించాలనుకుంటే, అప్పుడు వాళ్లు వైవాహిక బంధంలోకి వెళ్లకూడదని సుప్రీం ధర్మాసనం తెలిపింది.జస్టిస్ బీవీ నాగరత్న, ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వివాహ బంధం కొనసాగుతున్న సమయంలోనే.. వ్యక్తిగతంగా జీవిస్తామని.. భార్య కానీ, భర్త కానీ చెప్పడం కుదరదు అని కోర్టు చెప్పింది. ఈ విషయంలో కోర్టు చాలా స్పష్టంగా ఉందని, పెళ్లి అంటే కలిసి జీవించడం అని ధర్మాసనం అభిప్రాయపడింది. పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు, రెండు ఆత్మలు ఏకం కావడం అని, మీరెలా వ్యక్తిగతంగా ఉండగలరని కోర్టు ప్రశ్నించింది.పెళ్లి చేసుకున్న జంట.. వ్యక్తిగతంగా జీవిస్తానని చెప్పడం అసాధ్యమని కోర్టు పేర్కొన్నది. ఒకవేళ ఆ జంట ఒక్కటైతే, మేం సంతోషంగా ఉంటామని, ఎందుకంటే వాళ్ల పిల్లలు ఇంకా చిన్నవయసులోనే ఉన్నారని కోర్టు చెప్పింది. గూడు చెదిరిన ఇంట్లో ఎలా ఆ పిల్లలు ఉంటారని, దీంట్లో వాళ్ల తప్పు ఏంటని కోర్టు ప్రశ్నించింది. ఇద్దరూ తమ మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ప్రతి భార్యాభర్తల మధ్య ఏదో ఒక రకమైన వివాదం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. భర్త సింగపూర్‌లో ఉంటున్నాడు. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సింగపూర్ వెళ్లేందుకు భార్య ఇష్టపపడం లేదు. సింగపూర్‌లో తన భర్త ప్రవర్తన సరిగా లేదని ఆమె కోర్టుకు చెప్పింది. ఆ సమయంలో కోర్టు ఆమెను కొన్ని ప్రశ్నలు వేసింది. పిల్లల పేరిట కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని భర్తకు కోర్టు సూచన చేయగా, అయితే తాను ఎవరిపై ఆధారపడడానికి ఇష్టంగా లేనట్లు భార్య చెప్పింది.ఆ సమయంలో జస్టిస్ నాగరత్న స్పందిస్తూ మీరలా మాట్లాడకూడదని, ఒకసారి పెళ్లి అయితే, మీరు భావోద్వేగంగా, మరే రీతిలో అయినా భర్తపై ఆధారపడుతారని, ఆర్థికంగా కాకపోవచ్చు అని అన్నారు. నేను ఎవరి మీద ఆధారపడను అని చెప్పవద్దు అని, అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారని జస్టిస్ నాగరత్న అడిగారు. నేను పాత కాలం మనిషినే కావొచ్చు, కానీ భర్తపై ఆధారపడను అని ఏ భార్య కూడా చెప్పవద్దు అని అన్నారు. మీరంతా చదువుకున్నవాళ్లు, సమస్యను మీరే పరిష్కరించుకోవాలని జస్టిస్ తెలిపారు.