జలాశయంలోని మొత్తం 33 గేట్లలో పనిచేయని మరో ఏడు గేట్లు ?
జలాశయానికి వచ్చి చేరుతున్న23 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం
బెంగళూరు :
కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర జలాశయం మరోసారి ప్రమాదపుటంచున నిలిచింది. గతేడాది ఇదే నెలలో వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకోపోయిన విషయం తెలిసిందే. దీంతో దానిని స్టాప్‌లాగ్‌లను ఏర్పాటు చేసి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. తాజాగా జలాశయంలోని మొత్తం 33 గేట్లలో మరో ఏడు గేట్లు పనిచేయడం లేదని తేలింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్యామ్ భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది.గతేడాది ఆగస్టు 10న వచ్చిన వరదలకు డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో కన్నయ్యనాయుడు సలహాతో స్టాప్‌లాగ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్తగేటు తయారు చేసినప్పటికీ ఈ ఏడాది ముందస్తు వరదలతో ఆ గేటును అమర్చలేకపోయారు. కాగా, జలాశయానికి ఉన్న మొత్తం గేట్ల కాలపరిమితి దాటిపోయిందని, అన్నిటినీ మార్చాల్సిందేనని ఆయన సూచించారు. వచ్చే ఏడాది జూన్‌లోగా మొత్తం 33 గేట్లను మార్చాలన్న ఉద్దేశంతో జలాశయం సమీపంలోని గదగలో గేట్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే మరో ఏడు గేట్లు (4, 11, 18, 20, 24, 27, 28) ప్రమాదంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీంతో ఎంత వరద వచ్చినా వాటిని మాత్రం ఎత్తకూడదని ఇంజినీర్లు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. 4వ గేటునూ ఓ అడుగుదాకా ఎత్తవచ్చు, తరువాత అదీ మొరాయించే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం జలాశయానికి 23 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. మూడు గేట్లను మాత్రమే పైకెత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. మిగిలిన వరదను కాలువలకు వదులుతున్నారు.