ఢిల్లీలో ఉద్రిక్తత.. బారికేడ్లు ఎక్కి దూకిన ఎంపీ అఖిలేష్ యాదవ్
న్యూ డిల్లీ :
బీహార్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీలు మార్చ్ చేపట్టారు. ఎంపీలు చేపట్టిన ఈ ర్యాలీ ఉద్రిక్తతంగా మారింది.ఇండియా కూటమి ఎంపీల ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు సంసద్ మార్గ్‌లో భారీగా మోహరించారు. ఈసీ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్తున్న ఎంపీలను బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. అయితే, ప్రతిపక్ష ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాజ్‌వాది పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ బారికేడ్లు ఎక్కి దూకారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఎంపీల నిరసనతో రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.