తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం..
చెన్నై :
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య హిందీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో స్టాలిన్ జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల కోసం సొంతంగా స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ఆవిష్కరించారు. కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి కౌంటర్‌గా స్టాలిన్ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టబోతున్నారు. అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో నూతన స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని స్టాలిన్ శుక్రవారం ఆవిష్కరించారు. కేంద్రం చెబుతున్న త్రిభాషా సూత్రాన్ని తోసిపుచ్చుతూ ద్విభాషా అజెండాతో ఈ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించారు. 2022లో రిటైర్డ్ జడ్జి జస్టిస్ మురుగేశణ్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి, నూతన విద్యావిధానాన్ని రూపొందించాలని ఆదేశించగా, ఈ కమిటీ గతేడాది తమ ప్రతిపాదనలను సీఎం స్టాలిన్‌కు అందజేసింది. మురుగేశణ్ కమిటీ అందించిన రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తాజాగా ఇవాళ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ఆవిష్కరించారు స్టాలిన్.
స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీలోని ముఖ్యాంశాలు..
మాతృ భాషతో పాటు ఇంగ్లీష్, ఏఐ, సైన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నీట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. కొత్త విద్యావిధానంలో ప్రవేశ పరీక్షకు బదులుగా మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. 11, 12వ తరగతుల మార్కుల ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. 3, 5, 8 తరగతులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కమిటీ తోసిపుచ్చింది. దీని కారణంగా అధిక డ్రాపౌట్ రేటు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది.