కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ :
ఆపరేషన్ సింధూర్‌పై ఇవాళ లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో.. పాకిస్థాన్ లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. ఆ పరిస్థితికి దారితీసిన ఘటనలను ఆయన సభలో పేర్కొన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారని, దాంట్లో 25 మంది భారతీయులు, ఓ నేపాలీ ఉన్నారన్నారు. ఏప్రిల్ 30వ తేదీన సీసీఎస్ మీటింగ్‌లో సింధూ నదీ జలాలపై నిర్ణయం తీసుకున్నామన్నారు. పాకిస్థానీ పౌరుల్ని వెనక్కి పంపామన్నారు. సీఆర్పీఎఫ్, ఆర్మీ, జేకే పోలీసులు ఉగ్రవాదులకు గట్టి బదులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.మే 9వ తేదీన పాకిస్థాన్‌పై దాడి కోసం ఆర్మీకి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి షా చెప్పారు. 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశామన్నారు. నూర్ ఖాన్ ఛక్లా, మురిద్, సుగుర్దా, రఫికీ, రహిమ్ ఖాన్, జాకోబాబాద్, భోలారిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఆరు రేడార్లను, సర్ఫేస్ టు ఎయిర్ ఆయుధాలను ధ్వంసం చేశామన్నారు. ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేయలేదని, కానీ భారత్‌లో ఉన్న పౌర ప్రాంతాలను పాకిస్థాన్ అటాక్ చేసే ప్రయత్నం చేసిందన్నారు. పాకిస్థాన్ తన దాడులకు చెందిన అన్ని రకాల సామర్థ్యాలను కోల్పోవడంతో, ఆ దశలో ఆ దేశానికి మరో అవకాశం లేకుండా పోయిందని, అప్పుడు పాకిస్థాన్ లొంగిపోయినట్లు అమిత్ షా తెలిపారు.మే 10వ తేదీన పాకిస్థాన్ డీజీఎంవో.. దాడుల్ని ఆపేస్తున్నట్లు సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేశారన్నారు. అయితే అడ్వాంటేజ్ ఉన్న సమయంలో ఎందుకు అటాక్ చేయలేదని ప్రశ్నిస్తున్నారని, కానీ ప్రతి యుద్ధానికి ఓ సామాజిక కోణం ఉంటుందని మంత్రి అన్నారు. 1951, 1971లో జరిగిన యుద్ధాల గురించి ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను నెహ్రూ అప్పగించారని, షిమ్లా ఒప్పందంలో దాన్ని డిమాండ్ చేయలేదన్నారు.