కెమెరా లేకుండానే వ్యక్తులను గుర్తించే హూ-ఫై!

Facebook
X
LinkedIn

       సరికొత్త నిఘా టెక్నాలజీ అభివృద్ధి

న్యూఢిల్లీ :

ఎలాంటి కెమెరాలు అవసరం లేకుండా, విజువల్‌ ఇన్‌పుట్‌తో పనిలేకుండా వ్యక్తులను గుర్తించే హైటెక్‌ నిఘా టెక్నాలజీని ఇటలీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఏఐతో పనిచేసే ఈ సాంకేతికతతో వ్యక్తులను, వారి కదలికలను గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ టెక్నాలజీని హూ-ఫై(Who-Fi )గా వ్యవహరిస్తున్నారు. సాధారణ వైఫై సిగ్నల్‌ని బయోమెట్రిక్‌ స్కానర్‌గా ఇది మారుస్తుందని వెల్లడించారు. ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ వంటి సంప్రదాయ బయోమెట్రిక్‌ సిస్టమ్స్‌ మాదిరిగా దీనికి ఫిజికల్‌ కాంటాక్ట్‌, విజువల్‌ ఫీడ్‌ అవసరం లేదు. కేవలం వైఫై సిగ్నల్స్‌ ద్వారా ఇది పనిచేస్తుంది.

 ఎలా పనిచేస్తుంది?

వైఫై సిగ్నల్స్‌ని వ్యక్తి అడ్డుకునే తీరును బట్టి ఈ హూ-ఫై టెక్నాలజీతో ఆ వ్యక్తిని గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు. వైఫై సిగ్నల్స్‌ సమీపంలోకి వ్యక్తి వచ్చినప్పుడు, సిగ్నల్‌ సహజంగా ప్రయాణించే మార్గంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా ఒక యూనిక్‌ ప్యాటర్న్‌ ఏర్పడుతుంది. చేతి వేలిముద్రలు, ముఖ కవళికలు, రెటీనా నిర్మాణం వంటి బయోమెట్రిక్‌ సిగ్నేచర్స్‌ మాదిరిగానే ఇది అత్యంత కచ్చితంగా ఉంటుంది. హూ-ఫై సిస్టమ్‌ ఈ సిగ్నేచర్‌ను గుర్తించి, వ్యక్తులకు ఆపాదిస్తుంది. ఈ సిగ్నేచర్స్‌పై ఒకసారి దీనికి శిక్షణ ఇస్తే, ఆ వ్యక్తి కదలికలను కనిపెట్టడం మాత్రమే కాకుండా, సుదీర్ఘ కాలం గడచిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆ నెట్‌వర్క్‌ జోన్‌లోకి తిరిగి ప్రవేశించినపుడు కూడా గుర్తించగలదు. కెమెరాలు, మైక్రోఫోన్లు వంటివాటిని ఉపయోగించవలసిన అవసరం ఉండదు.హూ-ఫై సిస్టమ్‌కు సింగిల్‌ యాంటెన్నా ట్రాన్స్‌మిటర్‌, త్రీ-యాంటెన్నా రిసీవర్‌ ఉంటే సరిపోతుంది. అంటే, దీని కోసం ఖర్చు కూడా తక్కువే. టార్గెట్‌ ఓ గోడ వెనుక ఉండి, సాధారణ వేగంతో నడుస్తున్నప్పుడు, హూ-ఫై సిస్టమ్‌ 95.5 శాతం కచ్చితత్వంతో గుర్తించగలిగిందని పరిశోధకులు చెప్పారు. ఆ వ్యక్తి బట్టలు మార్చినా, బ్యాక్‌ప్యాక్‌ ధరించినా ఈ కచ్చితత్వం మారలేదన్నారు.