న్యూ డిల్లీ :
బ్రిటిష్ విస్కీకి ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు మార్కెట్‌గా భారత్ మారింది. స్కాచ్ విస్కీ అసోసియేషన్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ (CBI) డేటా ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ వినియోగ దేశంగా నిలిచింది. ప్రతి సంవత్సరం 220 మిలియన్ (22కోట్లు) లీటర్లకుపైగా విస్కీని వినియోగిస్తుంది. యూకే నుంచి భారత్ ప్రతి సంవత్సరం దాదాపు రూ.13వేలకోట్ల విలువైన జానీ వాకర్, చివాస్ రీగల్, బాలంటైన్స్, గ్లెన్‌ఫిడిచ్, ది మకాల్లన్ వంటి ప్రీమియం, ప్రామాణిక స్కాచ్ బ్రాండ్‌లను దిగుమతి చేసుకుంటుంది. స్కాచ్ విస్కీపై 150శాతం దిగుమతి సుంకాన్ని క్రమంగా 75శాతానికి, అంతకంటే తక్కువకు తగ్గించడానికి భారత్ అంగీకరించింది. భారత్-యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన విషయం తెలిసిందే.ఈ ఇందులో భాగంగానే సుంకాన్ని తగ్గించేందుకు భారత్ అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాంతో భారత మార్కెట్‌లో స్కాచ్ రిటైల్ ధరలు 10 నుంచి 30 శాతం తగ్గుతాయని భావిస్తున్నారు. దాంతో జానీ వాకర్ బ్లాక్ లేబుల్, గ్లెన్‌ఫిడిచ్ వంటి ప్రీమియం విస్కీల ధరలు సైతం సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. స్కాచ్ విస్కీ అసోసియేషన్ ప్రకారం.. పన్ను తగ్గింపుతో భారతదేశంలో స్కాచ్ అమ్మకాలు 20నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశాలున్నది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (CBIC) ప్రకారం.. భారత్ ఏటా రూ. 2.5 లక్షల కోట్లకుపైగా పన్ను ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఇందులో ఎక్కువ భాగం విదేశీ బ్రాండ్ల నుంచే వస్తుంది. ధరల తగ్గింపు నేపథ్యంలో కొంత వరకు పన్నులు తగ్గించే అవకాశం ఉంటుందని.. డిమాండ్ పెరుగుదలతో మొత్తం అమ్మకాలు పెరిగి ఆదాయం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.