న్యూ డిల్లీ :
ప్రముఖ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మార్చిలో ఇంటెల్ కొత్త సీఈఓగా లిప్-బు టాన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో సంస్థ భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోంది. ఇంటెల్ తాజాగా భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.ది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. సంస్థ త్వరలోనే 25,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించనుంది. ప్రస్తుతం 1,08,900 మంది ఉద్యోగులున్న ఈ సంస్థ.. 2025 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 75,000కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇంటెల్ ఇప్పటికే సుమారు 15 శాతం అంటే సుమారు 15,000 ఉద్యోగాలను తగ్గించింది. గతేడాది 15 వేలకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఉద్యోగ కోతలు లేఆఫ్‌లు, సహజ విరమణలు, ఇతర చర్యల ద్వారా జరుగుతాయని నివేదిక వెల్లడించింది.2025 రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ ఇంటెల్ ఉద్యోగుల తొలగింపును ధృవీకరించింది. పునర్నిర్మాణ ఖర్చులతో సహా కంపెనీ 2.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 12.9 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో సంస్థ ఆదాయం 12.6 బిలియన్ డాలర్ల నుంచి 13.6 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తోంది.ఇంటెల్ సీఈవో లిప్-బు టాన్ ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను ప్రస్తావించారు. గత కొన్ని నెలలుగా పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నాయన్నారు. సంస్థను క్రమబద్ధీకరించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రతి స్థాయిలో జవాబుదారీతనం పెంచడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.