ఖరగ్‌పూర్ :
ఓ ఏనుగుల మంద రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మూడు ఏనుగులు మృతిచెందాయి. వాటిలో ఒక తల్లి ఏనుగు కాగా రెండు గున్న ఏనుగులు ఉన్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బస్టోలా రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఖరగ్‌పూర్-టాటానగర్ రైల్వే మార్గంలో ఏడు ఏనుగులతో కూడిన ఓ మంద ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి ఏనుగు సహా దాని రెండు పిల్లలు అక్కడికక్కడే మరణించాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.ఏనుగుల కళేబరాలను క్రేన్ సాయంతో ట్రాక్‌పై నుంచి తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా రైలు ప్రమాదాల్లో ఏనుగులు మరణించడం ఇదే తొలిసారి కాదని, దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో రైళ్లు ఢీకొట్టడంతో ఏనుగులు మృతిచెందాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.