ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను అరెస్టు
అమృత్సర్ :
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని పేల్చివేస్తామంటూ వస్తున్న బెదిరింపులకు చెందిన కేసులో పోలీసులు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను అరెస్టు చేశారు. బెదిరింపు ఈమెయిల్స్ చేసిన అనుమానితుడిని శుభం డూబేగా గుర్తించారు. అతని స్వస్థలం ఫరిదాబాద్. పోలీసు కమీషనర్ గురుప్రీత్ సింగ్ బుల్లార్ దీనిపై ప్రకటన చేశారు. పాక్షికంగా సక్సెస్ సాధించినట్లు ఆయన చెప్పారు. ప్రశ్నించే నిమిత్తం అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు కమీషన్ వెల్లడించారు.డూబేకు చెందిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. జూలై 14వ తేదీ నుంచి శిరోమని గురుద్వారా ప్రబందక్ కమిటీకి ఆరు సార్లు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. గోల్డెన్ టెంపుల్‌ను పేల్చివేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. ఈ కేసు విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా భాగస్వామ్యమైనట్లు బుల్లార్ తెలిపారు. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలతో అనుమానితుడికి లింకు ఉన్నట్లు తెలుస్తోంది.