నేపాల్‌ను సరిహద్దు ప్రాంతంలో జోరుగా రూ.2వేల నోట్ల మార్పిడి అక్రమ వ్యాపారం

Facebook
X
LinkedIn

న్యూ డిల్లీ :

నేపాల్‌ను ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతంలో రూ.2వేల నోట్ల మార్పిడి అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నది. రూ.2వేల నోట్లు తీసుకొని వాటికి బదులుగా రూ.1200 నుంచి రూ.1600 వరకు ఇస్తున్నట్లు ఆదాయపు పన్నుశాఖ దర్యాప్తులో తేలింది. చెలామణి నుంచి పూర్తిస్థాయిలో నోట్లు ఆర్‌బీఐకి చేరలేదు. ఫిబ్రవరి నెలలో నేపాల్‌ సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో లక్నోలోని ఆదాయపు పన్నుశాఖ దర్యాప్తు విభాగం దాడులు చేసి కీలకమైన ఆదేశాలు సేకరించింది. ఈ వ్యవహారంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నది.సరిహద్దుకు ఇరువైపులా నోట్లను మార్చే ఈ అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సరిహద్దులోని రక్సౌల్, రుపైదిహా, బర్హ్ని వంటి ప్రదేశాలకు ఆదాయపు పన్ను శాఖ బృందాలు విచారణ జరుపగా.. నోట్ల మార్పిడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎక్కువగా నిరుద్యోగ యువకులను వాడుకుంటున్నారని.. ప్రతిగా వారికి కమిషన్‌ ఇస్తున్నట్లు తేలింది. అయితే, ప్రస్తుతం అధికారులు ఓ నోట్లు ఎక్కడికి పంపుతున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.ప్రస్తుతం నిబంధనల ప్రకారం రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ కార్యాలయాలు, పోస్టాఫీస్‌లలో మాత్రమే డిపాజిట్‌ చేసేందుకు అవకాశం ఉంది. రూ.30వేల వరకు పరిమితి ఉంది. ప్రస్తుతం ఆదాయపు పన్నుశాఖ నేపాల్‌ సరిహద్దులో ఉన్న పోస్టాఫీసులపై దృష్టి సారించాయి. గత కొంతకాలంగా రూ.2వేల నోట్లను ఎవరు మార్పిడి చేస్తున్నారో తెలుసుకునేందుకు ఐటీ ప్రయత్నిస్తున్నది. అయితే, నోట్లను మార్చుకునే వ్యక్తులు ఫేక్‌ ఐడీలను ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు కోసం ఆదాయపు పన్నుశాఖ కొందరు ప్రైవేట్‌ వ్యక్తులను రూ.2వేల నోట్లతో నేపాల్‌కు పంపింది. అక్కడ వారంతా ఈ నోట్లను సులభంగానే మార్చుకున్నారు. ఆదాయపు పన్నుశాఖ ఈ ఆపరేషన్‌ను గోప్యంగా నిర్వహించారు. కనీసం పోలీసుల సహాయం తీసుకోకపోవడం విశేషం. ఈ దర్యాప్తు సమయంలో నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో వేలాది యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని ఆదాయపు పన్నశాఖకు సమాచారం అందింది. అక్రమ మసీదులు, మదర్సాలు, సమాధులను నిర్మించేందుకు అక్రమ మత మార్పిడిలకు దీన్ని ఉపయోగిస్తున్నారని.. తమిళనాడుకు చెందిన ఓ సంస్థ నిధులు సమకూరుస్తున్నట్లుగా సమాచారం.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.