జార్ఖండ్ :
మద్యం వ్యాపారులు లక్షల రూపాయల విలువ చేసే లిక్కర్‌ను మాయం చేశారు. ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో విషయం బయటపడింది. లిక్కర్ ఏమైందని ప్రశ్నించిన అధికారులకు మద్యం వ్యాపారులు వింత సమాధానం చెప్పారు. ఎలుకలు తాగడంవల్లే మద్యం మాయమైందని తెలిపారు. దాంతో కంగుతినడం అధికారుల వంతయ్యింది.జార్ఖండ్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నారు. నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం బిజినెస్‌పై అజమాయిషీని ప్రైవేట్ లైసెన్స్‌దారులకు బదిలీ చేయనున్నారు. ప్రభుత్వంపై భారాన్ని తగ్గించడం కోసం, వ్యాపారంలో పారదర్శకత కోసం నూతన పాలసీని తీసుకొస్తున్నట్లు జార్ఖండ్ సర్కారు తెలిపింది.నూతన మద్యం పాలసీ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం స్టాక్ లెక్కలు తేల్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు మద్యం స్టాక్ లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ధన్‌బాద్ ఏరియాలో మద్యం స్టాక్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఏకంగా 800 సీసాల ఇండియా మేడ్ విదేశీ మద్యం మాయమైంది.దీనిపై ధన్‌బాద్ మద్యం వ్యాపారులను వివరణ కోరగా.. లెక్కరాకుండాపోయిన 800 సీసాల మద్యాన్ని ఎలుకలు తాగాయని చెప్పారు. మద్యం సీసాల మూతలను కొరికేసి నేలపాలు చేశాయని ఆరోపించారు. దాంతో అధికారులు షాకయ్యారు. నమ్మశక్యంగా లేని సమాధానం చెప్పిన మద్యం వ్యాపారులకు చీవాట్లు పెట్టారు. మిస్సయిన స్టాక్ విలువకు సమానంగా ప్రభుత్వానికి పరిహారం చెల్లించాలని నోటీసులు ఇచ్చారు.