భారతదేశంలో జూన్ 1, నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి…
ATM ఛార్జీలు, LPG ధరలలో మార్పులు
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొత్త రూల్స్
డ్రైవింగ్ టెస్ట్‌లలో మార్పులు:
పాస్‌పోర్ట్ నిబంధనలలో కీలక మార్పులు
న్యూ డిల్లీ :
భారతదేశంలో జూన్ 1, 2025 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులు ప్రధానంగా ఆర్థిక రంగానికి సంబంధించినవి కావడంతో, సామాన్య ప్రజల దైనందిన జీవితంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. అయితే ఈ కొత్త రూల్స్ వాటి ప్రభావాలు ఎలా ఉంటాయో ఇక్కడ చూద్దాం.
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొత్త రూల్స్
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొన్ని కీలక మార్పులు రానున్నాయి. యుటిలిటీ బిల్లుల (విద్యుత్, నీరు వంటివి) చెల్లింపులకు అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉంది. అలాగే, కొన్ని బ్యాంకులు ఇంధన చెల్లింపులపై (ఉదాహరణకు, కోటక్ మహీంద్రా బ్యాంక్) నెలవారీ పరిమితిని మించి చెల్లిస్తే 1% ఛార్జీని వసూలు చేయవచ్చు. అద్దె, యుటిలిటీ బిల్లులు, బీమా వంటి వాటిపై లభించే రివార్డ్ పాయింట్లపై కూడా పరిమితులు విధించే అవకాశం ఉంది. ఆటో-డెబిట్ చెల్లింపులు విఫలమైతే విధించే జరిమానా 2%కి తగ్గించబడవచ్చు. అంతర్జాతీయ లావాదేవీల రుసుములు, రివార్డ్ పాయింట్లపై కూడా మార్పులు ఉండవచ్చు కాబట్టి, మీ బ్యాంకుతో నిర్ధారించుకోవడం మంచిది.
ATM ఛార్జీలు, LPG ధరలలో మార్పులు
ATMల నుండి ఉచిత పరిమితికి మించి డబ్బు విత్‌డ్రా చేయడానికి ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి బ్యాంకు తన సొంత నిబంధనలను కలిగి ఉంటుంది, కాబట్టి మీ బ్యాంకు వెబ్‌సైట్ లేదా యాప్‌ను తనిఖీ చేయడం అవసరం. ఇదిలా ఉండగా, ప్రతి నెల 1వ తేదీన దేశీయ LPG సిలిండర్ ధరలు సవరించబడతాయి. చమురు కంపెనీలు మరియు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా మారకుండా ఉండవచ్చు.
ఆర్థిక పథకాలపై ప్రభావం
కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ఉదాహరణకు, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 60 బేసిస్ పాయింట్ల వరకు రేట్లను తగ్గించవచ్చు. ఇది పొదుపు చేసే వారిపై ప్రభావం చూపనుంది.
ఆధార్ అప్‌డేట్
ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి జూన్ 14, 2025 చివరి తేదీ. ఈ తేదీ తర్వాత, ఆన్‌లైన్ అప్‌డేట్‌లకు ₹25, ఆధార్ కేంద్రాలలో అప్‌డేట్‌లకు ₹50 ఛార్జీ విధించబడుతుంది.
EPFO 3.0 రోల్‌అవుట్: UPI ద్వారా PF విత్‌డ్రాయల్ సౌకర్యం
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) జూన్ 1, 2025 నుండి EPFO 3.0 ని ప్రవేశపెట్టింది. ఈ నూతన విధానం కింద, UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా PF (ప్రావిడెంట్ ఫండ్) విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఈ మార్పుతో, EPFO సభ్యులు తమ PF మొత్తాన్ని గతంలో మాదిరిగానే కాకుండా, UPI ద్వారా, అలాగే ATMల ద్వారా కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ప్రస్తుతం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) మరియు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సభ్యులకు పైలట్ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త విధానం PF విత్‌డ్రాయల్ ప్రక్రియను మరింత తేలికగా, వేగవంతంగా చేస్తుంది. ముఖ్యంగా, పీఎఫ్‌ను పెన్షనర్లకు మరింత అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకురాబడ్డాయి. EPFO 3.0 ప్లాట్‌ఫామ్ ద్వారా, PF విత్‌డ్రాయల్ ప్రక్రియ సరళీకృతం కావడంతో పాటు, KYC ప్రక్రియలు వేగవంతం అవుతాయి, క్లెయిమ్ ప్రాసెసింగ్ కూడా వేగంగా పూర్తవుతుంది. భవిష్యత్తులో ATM-వంటి కార్డులను కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉంది.
UPI లావాదేవీలలో కొత్త నిబంధనలు
జూన్ 30, 2025 నుంచి UPI యాప్‌ల ద్వారా జరిగే లావాదేవీలలో కీలక మార్పు రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశాల మేరకు, ఇకపై అన్ని UPI యాప్‌లు డబ్బు అందుకునే వారి అసలు బ్యాంకు పేరును మాత్రమే చూపించాలి. దీని అర్థం ఏమిటంటే.. ఇప్పటివరకు లావాదేవీలు చేసేటప్పుడు QR కోడ్‌ల ద్వారా వచ్చే పేర్లు లేదా యూజర్లు తమకు నచ్చినట్లు పెట్టుకున్న పేర్లు (ఉదాహరణకు రాజు కిరాణ షాపు) ఇకపై కనిపించవు. దీనికి బదులుగా, గ్రహీత ఏ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారో, ఆ బ్యాంకు అసలు పేరు మాత్రమే కనిపిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక దుకాణానికి డబ్బు పంపుతున్నట్లయితే, ఆ దుకాణం పేరు కాకుండా, వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగి ఉంటే, ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని కనిపించబోతుంది. ఈ కొత్త నిభందనల వలన డబ్బు ఎవరికి, ఏ బ్యాంకుకు వెళ్తుందో మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది లావాదేవీలలో పొరపాట్లు జరగకుండా, మోసాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మ్యూచువల్ ఫండ్స్‌పై కొత్త రూల్స్: కట్-ఆఫ్ సమయాల్లో మార్పు
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారికి సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. జూన్ 1, 2025 నుండి ఈ కట్-ఆఫ్ సమయాలు అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఆఫ్‌లైన్ ద్వారా మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు (అంటే బ్రోకర్ ఆఫీసులలో లేదా నేరుగా ఫండ్ హౌస్‌లలో) మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయి. అంటే, మీరు ఏదైనా కొనుగోలు లేదా అమ్మకం ఆర్డర్‌ను మధ్యాహ్నం 3 గంటలలోపు సమర్పిస్తే, అదే రోజు మార్కెట్ ధరలకు అది వర్తిస్తుంది. అలాగే, ఆన్‌లైన్ ద్వారా మ్యూచువల్ ఫండ్ లావాదేవీలకు (అంటే మొబైల్ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌ల ద్వారా) సాయంత్రం 7 గంటలను కట్-ఆఫ్ సమయంగా నిర్ణయించారు. మీరు ఆన్‌లైన్‌లో సాయంత్రం 7 గంటలలోపు ఆర్డర్ చేస్తే, అదే రోజుకి సంబంధించిన యూనిట్ ధర (NAV) వర్తిస్తుంది.
డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు: జూన్ 1, 2025 నుంచి కొనసాగింపు
డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించి గతేడాది జూన్ 1, 2024 నుంచి అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు 2025 జూన్‌లోనూ కొనసాగుబోతున్నాయి. ఈ మార్పులు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, నిబంధనల ఉల్లంఘనకు కఠినమైన జరిమానాలను కూడా నిర్దేశిస్తాయి.
డ్రైవింగ్ టెస్ట్‌లలో మార్పులు:
ఇకపై, గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలో డ్రైవింగ్ టెస్ట్‌లను నిర్వహించనున్నారు. ఈ డ్రైవింగ్ స్కూళ్లు టెస్ట్‌లు నిర్వహించి, విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్‌ను జారీ చేస్తాయి. ఈ సర్టిఫికెట్ ఉన్న వారికి రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO) వద్ద మళ్లీ టెస్టింగ్ అవసరం లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయబడుతుంది. ఇది లైసెన్స్ పొందే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 2,000 జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా, మైనర్లు (18 సంవత్సరాలలోపు వారు) డ్రైవింగ్ చేస్తే రూ. 25,000 భారీ జరిమానా విధిస్తారు. ఈ నిబంధనలు జూన్ నెలలో కూడా అమల్లో కాబోతున్నాయి.
పాస్‌పోర్ట్ నిబంధనలలో కీలక మార్పులు
పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు చేసింది. ఫిబ్రవరి 28 నాటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
పుట్టిన తేదీ ఐడెంటిటీలో మార్పులు:
అక్టోబర్ 1, 2023 తర్వాత జన్మించినవారు: పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి. అక్టోబర్ 1, 2023 కంటే ముందు జన్మించినవారు: వీరు పుట్టిన తేదీ రుజువుగా పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు పొందిన పత్రాలను ఉపయోగించవచ్చు. బర్త్ సర్టిఫికెట్ అవసరం లేదు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.