తెలుగునాడు, హైదరాబాద్ :
కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న హిందీ సలహా సంఘం పునర్నిర్మాణానికి సంబంధించి కీలక నియామకాలు చోటు చేసుకున్నాయి. పద్మభూషణ్ పురస్కార గ్రహీత, సాహిత్య విమర్శకుడు, ప్రఖ్యాత రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ సంఘానికి సభ్యునిగా ఎంపికయ్యారు. హిందీ సలహా సంఘం కేంద్ర మంత్రిత్వ శాఖల హిందీ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తూ, భాషా పరంగా సమతుల్యతకు దోహదపడే విధంగా పని చేస్తుంది. ఇందులో మొత్తం పదిహేడు మంది సభ్యులు ఉండగా, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాత్రమే దక్షిణ భారతదేశం నుంచి ఎంపిక కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భాషా భిన్నతలు గల దేశంలో, దక్షిణాది రాష్ట్రాల హిందీ మద్దతుదారుల జ్ఞానం, అనుభవం కూడా కేంద్ర సంస్థల్లో ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. యార్లగడ్డ నియామకం ఈ కోణంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది.
ఆచార్య యార్లగడ్డ హిందీ భాషా అభివృద్ధికి చేసిన కృషి సుపరిచితమే. అటు తెలుగులో, ఇటు హిందీలో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించే సాహితీవేత్తగా ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన చేసిన సాహితీ సేవలకుగాను పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు లభించాయి. ఈ నియామకం మూడేళ్ల కాలానికి వర్తిస్తుంది. ఈ వ్యవధిలో హిందీ పరిపాలనా వ్యవస్థలలో సమగ్రత, ప్రాంతీయ భాషలతో మైత్రి, హిందీ కార్యక్రమాలలో సమగ్ర మానవ వనరుల వినియోగానికి సంబంధించి యార్లగడ్డ సలహాలు దిశానిర్దేశకంగా పని చేయనున్నాయు. ఈ సంఘంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సభ్యత్వం దక్షిణాది రాష్ట్రాల మేధస్సుకు వచ్చిన గౌరవమే కాక, భాషా సమరసతకు దోహదపడే శుభ సంకేతంగా భావించవచ్చు.