భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ

Facebook
X
LinkedIn

పాకిస్థాన్ అవాస్తవ ప్రచారంపై తీవ్ర విమర్శలు – భారత రక్షణ అధికారులు

తెలుగునాడు, న్యూఢిల్లీ:

భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందనీ, దీనిని భారత త్రివిధ దళాలు పూర్తిగా గౌరవిస్తున్నాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో అధికారుల వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఇండియన్ నేవీ కెప్టెన్ రఘు నాయర్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో భారత ప్రతిస్పందన శాంతియుతంగా, బాధ్యతాయుతంగా ఉందన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. “రక్షణకు అవసరమైన ప్రతీ చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము,” అని నాయర్ తెలిపారు.

వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, మసీదులను లక్ష్యంగా చేసిందన్న పాకిస్థాన్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆమె ఖండించారు. “భారత సాయుధ దళాలు ప్రతి మతపరమైన ప్రార్థనా స్థలాన్ని గౌరవిస్తాయి. మేము మతస్థానాలపై దాడులు చేయలేదు,” అని స్పష్టం చేశారు. ఈ ఘర్షణల్లో పాకిస్థాన్ వైమానిక స్థావరాలకు, సైనిక మౌలిక సదుపాయాలకు మాత్రమే నష్టం జరిగిందని ఆమె వివరించారు.

ఈ సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి, అదనపు కార్యదర్శి రణధీర్ జైస్వాల్ కూడా హాజరయ్యారు.