ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అసహనం
తెలుగునాడు, హైదరాబాద్,
హైదరాబాద్ నగరంలో వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసే ఇంకుడుగుంటల నిర్మాణంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య తీవ్రంగా విమర్శించారు . వర్షాలు ముంచుకొస్తున్న తరుణంలో నగరంలో భూగర్భ జలాలను పెంచే ఈ గుంటలు ఎంతో ముఖ్యమైనా అధికారులు పట్టించుకోవడం లేదని అయన ఆందోళన వ్యక్తం చేశారు .హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) ఇటీవల నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 300 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం కలిగిన 42,000 భవనాలలో ఇంకా 17,000 భవనాలలో ఇంకుడుగుంటలు నిర్మించలేదని తేలడం అత్యంత బాధాకరమన్నారు. ఇంకుడుగుంటలు నిర్మించని వారికి జనవరి 1, 2025 నుండి వాటర్ ట్యాంకర్ సేవలపై డబుల్ ఛార్జీలు విధిస్తామని అధికారులు హెచ్చరించినా, ఆచరణలో ఆ చర్యలు కనిపించడం లేదని రంగయ్య వాపోయారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ దేవేందర్ కొత్త నిర్మాణదారులకు నోటీసులు జారీ చేస్తున్నామని చెబుతున్నారని, పాత భవనాల ఇంకుడు గుంతల విషయంలో తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని రంగయ్య పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ ఈ విషయంపై తక్షణమే దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం వల్ల భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పెరుగుతుందని, ఇది నగరానికి దీర్ఘకాలికంగా ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.వర్షాకాలం సమీపిస్తున్నందున, హైదరాబాద్ నగరంలో నీటి కొరతను నివారించడానికి ఈ ఇంకుడుగుంటల నిర్మాణం అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. అవసరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంపై అధికారులను ప్రత్యక్షంగా ఆదేశించాలని రంగయ్య కోరారు.