విజయవంతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
తెలుగునాడు, హైదరాబాద్ :
తెలంగాణ ఖ్యాతిని విశ్వమంతటికీ పరిచయం చేయాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ ( Miss World 2025) పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ స్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారికి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెల 10 వ తేదీ నుంచి తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్న # Miss World ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోటీదారులతో పాటు దేశ విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు 3 వేల మంది మీడియా ప్రతినిధులు, అతిథులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలి. పోటీలు పూర్తయ్యేంత వరకు ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా ఏర్పాట్లు ఉండాలి.
పర్యాటక శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలి. అధికారులందరూ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలి. ప్రతి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించాలి.
మే 10వ తేదీన సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో మిస్‌వరల్డ్ ప్రారంభోత్సవం నుంచీ 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమం విజయవంతంగా సాగాలి.

Miss World కార్యక్రమానికి వచ్చే విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతో పాటు హైదరాబాద్‌లో వారు పర్యటించనున్న చార్మినార్, లాడ్‌బజార్, చౌమహల్లా ప్యాలెస్, సెక్రటేరియట్ తెలంగాణ తల్లి వంటి ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి. వారికి అవసరమైన రవాణా, వసతులు ఏర్పాటు చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉండాలి.
మహిళా సాధికారతను చాటిచెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతో పాటు, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్స్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు అంతరాయం రాకూడదు. వాతావరణ సూచనలకు అనుగుణంగా గ్రేటర్ సిటీ పరిధిలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా విభాగాలు అప్రమత్తంగా ఉండాలి.
రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూరిబా పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఒకరోజు మిస్ వరల్డ్ వేడుకలు చూపించాలి.
వేడుకలు జరిగే రోజుల్లో హైదరాబాద్ అంతటా మిస్ వరల్డ్ సందడి కనిపించేలా తోరణాలు, లైటింగ్, హోర్డింగ్‌లతో పాటు సిటీలోని ముఖ్యమైన జంక్షన్లు, చారిత్రక ప్రదేశాలను అందంగా అలంకరించాలి.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ , రాష్ట్ర డీజీపీ జితేందర్ , హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ , రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఏడీజీపీ స్టీఫెన్ రవీంద్ర తో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.