రహదారుల అనుసంధానానికి మరిన్ని నిధుల మంజూరుకు కృషి
కేంద్ర రహదారుల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి
తెలుగునాడు,, ఆదిలాబాద్ :
జాతీయ రహదారుల విస్తరణతో అభివృద్ధి బాటలు వేయడం జరుగుతుందని, రహదారుల అనుసంధానానికి మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని కేంద్ర రహదారుల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. సోమవారం జిల్లాలోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద మంచిర్యాల నుండి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు వరకు 3 వేల 900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 4 వరుసల జాతీయ రహదారిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గొడం నగేష్, గడ్డం వంశీకృష్ణ, ఉమ్మడి ఆదిలాబాద్ శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఆసిఫాబాద్, సిర్పూర్, ఆదిలాబాద్, ఖానాపూర్, ముతోల్ నియోజకవర్గాల శాసనసభ్యులు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, పాయల శంకర్, వెడ్మ బొజ్జు, రామారావు పటేల్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జాతీయ రహదారుల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల శాఖ మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారుల విస్తరణతో అభివృద్ధికి బాటలు పడతాయని, రహదారుల అనుసంధానానికి మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆర్థికంగా, సామాజికంగా కొంత వెనుకబడి ఉందని, ఈ ప్రాంతంలో జాతీయ రహదారుల ఏర్పాటుతో పరిశ్రమలు రావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. జాతీయ రహదారుల అనుసంధానం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణ సమయం ఆదా, వాహనాల క్షేమం, తక్కువ సమయంలో సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని 32 జిల్లాల కేంద్రాల నుండి రాష్ట్ర రాజధానికి జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నామని, వచ్చే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. సమృద్ధిగా నీరు, విద్యుత్ సౌకర్యం, రవాణా సదుపాయం, సరైన సమాచార వ్యవస్థ ఉన్నట్లయితే ఆ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం ద్వారా ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, జాతీయ రహదారుల నిర్మాణంలో అవసరమైన మట్టిని చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల నుండి ఉచితంగా తీసుకోవడం ద్వారా ఆయా ప్రాంతాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. 4 వరుసల రహదారిని 6 వరుసల రహదారిగా విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మంచిర్యాల- తెలంగాణ/మహారాష్ట్ర సరిహద్దు వరకు జాతీయ రహదారి 363 లో 94.6 కిలోమీటర్ల పొడవుతో 3 వేల 526 కోట్ల రూపాయల వ్యయంతో 4 వరుసల రహదారి నిర్మాణం చేపట్టడం జరిగిందని, నిర్మల్- ఖానాపూర్ సెక్షన్ లో జాతీయ రహదారి 61 లో 17.79 కిలోమీటర్ల పొడవుతో 127 కోట్ల రూపాయల వ్యయంతో 2 వరుసల పేవ్డ్ షోల్డర్ తో రహదారి నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. నాగపూర్ -హైదరాబాద్ సెక్షన్ లో జాతీయ రహదారి 44 లో 1 కిలోమీటర్ పొడవుతో 29 కోట్ల రూపాయల వ్యయంతో అండర్ పాస్ నిర్మాణం, 2 కిలోమీటర్ల పొడవుతో 18 కోట్ల రూపాయల వ్యయంతో సర్వీసు రోడ్లు, జంక్షన్లు అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు, రైల్వే, ఎరువుల కర్మాగారం, కాజీపేటలో రైల్వే కోచ్ల తయారీ, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు.