తెలుగునాడు, అమరావతి :
అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం.. సభా వేదికపై ప్రసంగించారు ప్రధాని నరేంద్రమోడీ. జూన్ 21న మళ్లీ ఏపీకి వస్తానన్న ఆయన ఆ రోజున యావత్ ప్రపంచం మనవైపు చూసి మాట్లాడుకునేలా చేయాలన్నారు. జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇంకా 50 రోజులు ఉందని, ఈ 50 రోజుల్లో ఏపీలోని ప్రతి ఊరు, గ్రామం, వీధి, ఇంటిలో యోగాని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అది సాధ్యమవుతుందని తాను నమ్ముతున్నానని, ఈ ఘనతను సాధిస్తామని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించే యోగా దినోత్సవానికి తాను కచ్చితంగా వస్తానని మరోసారి నొక్కి చెప్పారు. ఏపీలో కలలు కనేవారు తక్కువకాదు, వాటిని నిజం చేసేవారి సంఖ్య కూడా తక్కువ కాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగాన్ని ఇలాగే కొనసాగించాలని, మూడు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో తాను ఊహించగలనని తెలిపారు. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీకి అమరావతి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పనిచేస్తానని ప్రధాని మోడీ చెప్పారు. “మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది” అని చివరిగా తెలుగులో ప్రసంగించి.. తన స్పీచ్‌ను వందేమాతరం అంటూ ముగించారు.