’రైతులు రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారు: పవన్‌కల్యాణ్’

Facebook
X
LinkedIn

’ధర్మయుద్ధంలో రైతులు గెలిచారు – 34 వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారు’

తెలుగునాడు, అమరావతి :

’రాజధాని రైతులు ధర్మ యుద్ధంలో విజయం సాధించారని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు శిరసు వంచి నమస్కారం చేస్తున్నానన్నారు. రాజధాని లేకుండా చేసే ప్రయత్నాలను రైతులు విజయవంతంగా తిప్పికొట్టారని చెప్పారు. దేశమే ఇల్లుగా, ప్రజలే కుటుంబంగా భావించే ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు.’

యావత్​ రాష్ట్రానికి విశ్వాసం: అమరావతి మహిళా రైతుల పోరాడిన సాహసం ఎవరూ మర్చిపోలేదని తెలిపారు. రైతులు భూములు మాత్రమే కాదు యావత్ రాష్ట్రానికి ఓ విశ్వాసాన్ని ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల అమరావతి పనులు, కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలకం అవుతాయని చెప్పారు. వచ్చే పెట్టుబడులతో ఇక్కడి యువత హైదారాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

యావత్​ దేశానికి ఏపీ బాసట: కాశ్మీర్​లో ఉగ్రదాడిలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెలిపారు. దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయని, అయినా ప్రధానమంత్రి అమరావతిపై ప్రేమతో సమయం తీసుకుని ఇక్కడకు వచ్చారని ఆయనకు ప్రత్యేక ధన్వాదాలు తెలిపారు. ప్రధానికి యావత్ దేశ ప్రజల పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బాసటగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రధానికి, దేశానికి, రాష్ట్రానికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. ప్రధాని మోదీ అండ, చంద్రబాబు ఆలోచనలతో అమరావతి సర్వశ్రేష్ట రాజధానిగా నిలుస్తుందని పవన్ అన్నారు. రాళ్లలో రప్పల్లో ఓ మహానగరాన్ని చూసి సైబరాబాద్‌ను చంద్రబాబు ఎలా అభివృద్ధి చేశారో అలాగే అమరావతి కూడా అభివృద్ధి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధానికి శక్తినివ్వాలి: పెహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తోందని గుండెల్లో ఎంతో బరువున్నా ప్రధాని అమరావతి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రదాడి బాధితుల ఆవేదనను ప్రత్యక్షంగా చూశానని, ఈ విషయంలో ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటామని తెలిపారు. కనకదుర్గమ్మ ప్రధానికి శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం రాష్ట్ర, అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టిందని, ఇక్కడ సెక్షన్‌ 144 గుర్తుకొచ్చేలా చేశారని పవన్ దుయ్యబట్టారు.

వారి సాహసం అందరికీ ఆదర్శం: అమరావతికి కోసం జరిగిన ధర్మయుద్ధంలో రైతులు గెలిచారని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు ఐదేళ్లుగా నలిగిపోయారని, కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా అమరావతి పునః ప్రారంభం జరగటం సంతోషంగా ఉందన్నారు. మహిళలు, దివ్యాంగుల మీద పోలీసు లాఠీలు పడ్డాయని, గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి మహిళల సాహసం, సహనం అందరికీ ఆదర్శమని వ్యాఖ్యానించారు.