తెలుగునాడు, హైదరాబాద్ :
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్, సిఐటియు ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమ మహనీయుల చైతన్య ఉత్సవాలలో భాగంగా సైనిక్‌పురి చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నివాళి మరియు సభా కార్యక్రమం జరిగింది.
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగే కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జె చంద్రశేఖర్, శ్రీనివాసరావు, మంగ, హెచ్ వి స్వామి, నరసింహారావు స్పూర్తి గ్రూపు నాయకులు గొడుగు యాదగిరిరావు, జయరాజ్, వెంకట్, జి శివరామకృష్ణ, రహీం, వెంకటసుబ్బయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి జే చంద్రశేఖర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో కృషి చేశారని చెప్పారు. ముఖ్యంగా ఆనాడు శూద్రులకు చదువు నిరాకరించబడటంతో, తాను ముందుగా చదువుకొని తన భార్యకు చదువు నేర్పి వెనకబడిన తరగతులకు ముఖ్యంగా అంటరాని కులాల వారికి అందులో బాలికలకు చదువులు చెప్పటం ఫలితంగా ఎంతో మంది అభివృద్ధికి దోహదపడ్డారని చెప్పారు. ఆయనను ఆనాడు వ్యతిరేకించి కించపరిచిన వాళ్ళు నేడు పరిపాలన చేస్తున్నారని, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పారు.
సామాజిక ఉద్యమ నేత జయరాజు మాట్లాడుతూ బ్రాహ్మణీయ భావజాలంతో ఆనాడు జ్యోతిరావు పూలేను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని దానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడారని చెప్పారు. వారికి నిజమైన నివాళి అంటే ఈనాడు ఉన్న మనువాద సంస్కృతిని దాన్ని పెంచి పోషించే వాళ్ళకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని చెప్పారు.
అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జీవితంపై తీసిన పూలే సినిమాను ఈనాడున్న బ్రాహ్మణీయ భావజాలం కలిగిన పాలకులు అడ్డుకున్నారని అటువంటి వారే నేడు ఆయనకు దండలు వేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నినాదాలు చేస్తున్నారు. ముందు అటువంటివారు తమ భావాలలో ఉన్న మనువాద సంస్కృతిని తొలగించుకోవాలని చెప్పారు. సేవా కార్యక్రమాల్లోనూ, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగానూ సకల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడని చెప్పారు. జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మన అందరి కర్తవ్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వంశరాజ్ మల్లేష్, నరసింహారావు, హెచ్ వి స్వామి, మంగ, రహీం, మంగ, యాదగిరిరావు, జె చంద్రశేఖర్, వెంకటసుబ్బయ్య, జయరాజ్, శివరామకృష్ణ, ఎం శ్రీనివాసరావు, శరత్ తదితరులు పాల్గొన్నారు.