– భారత సుదర్శన్, సామాజిక, రాజకీయ విశ్లేషకులు –
హిడెవరాబాద్ :
‘హ్యాండ్సాఫ్ ఉద్యమం’ (Hands Off Movement) అనేది సాధారణంగా ఒక నిరసన లేదా ప్రచారానికి ఉపయోగించే పదం. “హ్యాండ్సాఫ్” అంటే “దాని నుండి మీ చేతులను దూరంగా ఉంచండి” అనే సూచన. ఇది ఒక అంశంపై దుర్వినియోగం, దౌర్జన్యం చేయకూడదని చెప్పే ఉద్యమం. ప్రజల హక్కులు, స్వేచ్ఛ లేదా స్వయం ప్రతిపత్తిని కాపాడాలని కోరుతూ చేసే ఒక ఉద్యమమే ‘హ్యాండ్సాఫ్ మూవ్ మెంట్’. ప్రజాస్వామ్య ప్రకియలు, సంస్థలను రక్షించాలనే డిమాండ్ తో, ప్రజల హక్కులను కాపాడాలనే కోరికతో, ప్రజలు తమను అనవసరంగా అదుపు చేయకుండాలని కోరుకోవడమే ‘హ్యాండ్సాఫ్ ఉద్యమం’ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
‘‘హ్యాండ్సాప్ ట్రంప్ సర్కార్’’ ఎందుకు జరుగుతోంది?
అమెరికా చరిత్రనే తిరిగి రాసి మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 100 రోజులు కూడా పూర్తి చేసుకోకముందే ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసనలను ఎదుర్కొంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రెండవ పదవీకాలాన్ని 2025 జనవరి 20న ప్రారంభించారు. ఈ రోజు, 2025 ఏప్రిల్ 7, వరకు, ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 77 రోజులు పూర్తయ్యాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ (Make America Great Again)’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన ట్రంప్ అనూహ్యరీతిలో గ్యాప్ తర్వాత అనూహ్యరీతిలో అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. ఎన్నికైన మరుక్షణమే పరిపాలనలో దూకుడును పెంచాడు. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను పెద్ద ఎత్తున్న పెంచాడు. ఇదంతా అమెరికాను బలోపేత శక్తిగా తీర్చిదిద్దడం కోసమే అంటూ సెలవిచ్చాడు. దీనికి తోడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రత్యక్షంగా అమెరికా ప్రభుత్వంలో కొలువుదీరడంతో పరిణామాలన్నీ వేగంగా మారిపోతున్నాయి.అమెరికాలో ప్రస్తుతానికి ‘హ్యాండ్స్ ఆఫ్!’ ఉద్యమం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన సలహాదారు ఎలోన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోంది. ఓ రకంగా చెప్పాలంటే దీనిని ట్రంప్ పాలనపై వ్యతిరేకతగా పరిగణించవచ్చు. 2025 ఏప్రిల్ 5న, అమెరికా అంతటా అంటే అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 1,400కి పైగా ప్రదేశాల్లో లక్షలాది ప్రజలు ‘హ్యాండ్స్ ఆఫ్!’ పేరుతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలు న్యూయార్క్, అట్లాంటా, బోస్టన్, చికాగో, డల్లాస్, డెట్రాయిట్, లాస్ ఏంజిలిస్ వంటి ప్రధాన నగరాల్లో జరిగాయి. ఈ నిరసనలు రోజురోజుకూ పెరుగుతుండటం ఎటువైపు దారితీస్తుందో తెలియకుండా ఉంది. ఉద్యమం నిర్వహణ. ఈ ఉద్యమంలో సివిల్ రైట్స్ గ్రూపులు, కార్మిక సంఘాలు, వెటరన్లు వంటి వివిధ సంఘాలు కలిసి నిర్వహిస్తున్నాయి. వీరు ప్రభుత్వ విధానాలను ‘బిలియనీర్ల చేతుల్లోకి వెళ్లడం’గా అభివర్ణిస్తున్నారు.
నిరసనల కారణాలేంటంటే..
ట్రంప్ ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ, మెడికెయిడ్ వంటి సామాజిక సేవలలో కోతలు విధించడం, ప్రవాసులపై కఠిన నియంత్రణలు మరియు నిర్బంధాలు, ప్రభుత్వ సంస్థలను బిలియనీర్లకు అనుకూలంగా మార్చడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను హాని చేయడం, ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ నాయకత్వంలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)’ ద్వారా ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం లాంటివన్నీ ట్రంప్ సర్కారుపై నిరసనలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ట్రంప్ ప్రభుత్వం ఏమంటున్నదంటే..
ట్రంప్ సామాజిక భద్రతా కార్యక్రమాలను రక్షించడానికి కట్టుబడి ఉన్నారని, కానీ డెమోక్రాట్లు ఈ ప్రయోజనాలను అక్రమ ప్రవాసులకు విస్తరించడం ద్వారా ఈ కార్యక్రమాలను ప్రమాదంలో పడేస్తున్నారని వైట్ హౌస్ ఈ నిరసనలపై స్పందిస్తున్నది.’హ్యాండ్స్ ఆఫ్!’ ఉద్యమం అమెరికా ప్రజలు తమ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తిని వ్యక్తపరచడానికి ఒక ప్రధాన వేదికగా నిలిచింది. ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా రూపుదాల్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ తద్వారా ఇతర దేశాల అర్థిక వ్యవస్థలతో పాటుగా అనేక దేశాల వ్యవస్థల్లో మార్పులు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రజాభిప్రాయానికి ట్రంప్ తలొగ్గుతాడా.. హ్యాండ్సాఫ్ ఉద్యమాలను ఎదుర్కొంటాడా అనేది అతి త్వరలోనే తెలుస్తుంది.