మదురై : కేరళకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యులు మరియం అలెగ్జాండర్ బేబీ సిపిఐ(ఎం) 6వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో జరిగిన 24వ సిపిఐ(ఎం) మహాసభలో కేంద్ర కమిటి ఆయనను ఎన్నుకుంది.
కేరళలోని కొల్లాం జిల్లాలోని ప్రాక్కుళంలో 1954 ఏప్రిల్‌లో పి.ఎం. అలెగ్జాండర్ , లిల్లీ దంపతులకు ఆయన జన్మించారు. ప్రాక్కులం లోయర్ ప్రైమరీ స్కూల్, ప్రాక్కులం ఎన్‌ఎస్‌ఎస్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉన్నత పాఠశాల విద్య సమయంలోనే రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. ఎం.ఎ బేబీ ప్రాక్కుళంలోని ఎన్‌ఎస్‌ఎస్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) మాతృసంస్థ అయిన కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరారు. ప్రాథమిక విద్య అనంతరం ప్లస్ 2 కోసం కొల్లంలోని ఎస్.ఎన్ కశాశాలకు వెళ్లారు. ఎస్‌ఎన్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బిఎలో చేరారు. కానీ డిగ్రీని పూర్తి చేయలేకపోయారు.
ఎస్‌ఎఫ్‌ఐ, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సిపిఐ(ఎం)లలో అనేక బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఆయన 1986 నుండి 1998 వరకు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. 2006-2011సమయంలో కేరళ విద్యామంత్రిగా పనిచేశారు. 2012లో కేరళలోని కొజికోడ్‌లో జరిగిన 20వ సిపిఐ(ఎం) మహాసభల్లో ఎం.ఎ.బేబీ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయనకు భార్య బెట్టీ లూయిస్, కుమారుడు అశోక్ బెట్టీ నెల్సన్‌లు ఉన్నారు.