అధునాతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం
ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్లకు ప్రాధాన్యతనిస్తాం
అందుకే రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటుచేస్తున్నాం
పాలిటెక్ ఫెస్ట్ లో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
తెలుగునాడు, అమరావతి :
జీవన ప్రయాణంలో అనేక ఇబ్బందులు వస్తాయి, ఎదురుదెబ్బలు తగలొచ్చు. కిందపడ్డాక ఎంత త్వరగా లేస్తామనేది ముఖ్యం. అనుకున్నది సాధించేవరకు పట్టువదలొద్దని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ లబ్బీపేట ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటుచేసిన పాలిటెక్ ఫెస్ట్ కు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు అధునాతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… నేను విద్యాశాఖ మంత్రి అయినపుడు మన ఐటిఐ, పాలిటెక్నిక్ లు ఒకస్థాయికి వచ్చాయి. ఇక్కడితో ఆగకూడదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారుకావాలి. మార్కెట్ లింకేజి అవసరమని హెచ్ఆర్ డి కార్యదర్శితో చెప్పాను. ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ఇంత అద్భుతమైన పిల్లలు, ఐడియాలు ఉన్నాయని ఈరోజే తెలుసుకున్నాను. 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఈ పాలిటెక్ ఫెస్ట్. పిల్లలకు వారి ఐడియాలను పంచుకునే అవకాశాలు కల్పించాలి, వారు చేపడుతున్న ప్రాజెక్టులు అందరికీ చూపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఇక్కడితో ఆగకూడదు. నేను ఈరోజు చూసిన ఐడియాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈశ్వర్, లక్ష్మీశరణ్య తయారుచేసిన అటమిక్ సర్వీసెస్ ఫైర్ డిటెక్షన్ చూశాను. తొలుత చేయలేకపోయి బాధపడ్డాడు. తర్వాత ప్రయత్నంలో డిమానిస్ట్రేషన్ చేశారు. వారిని నేను అభినందిస్తున్నా. దాదాపు 1256 ప్రాజెక్టులు చూపించారు, 249 టాప్ ప్రాజెక్టులు స్టేట్ లెవల్ కు తెచ్చారు. అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తన్నా. నేను కూడా స్కూలింగ్ సమయంలో కారు తయారు చేశా. మీ ప్రాజెక్టులు చూశాక నేను తయారు చేసింది చాలా చిన్నదని తేలిపోయింది. ఒక పక్క కేంద్రం సహకారం, ఎపి ప్రభుత్వ ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడయాలను ఆవిష్కరించారు.
ఇదొక ఈవెంట్ కాదు…. మూమెంట్
ఈ సందర్భంగా కొన్ని విజయగాధలను మీ దృష్టికి తెస్తున్నా. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఆలోచనలను అమలుచేసేందుకు బోర్డు ఒప్పుకోకపోతే కంపెనీని వదిలి వెళ్లారు. ఆ తర్వాత బోర్డు ఆహ్వానం మరకు మళ్లీ వచ్చి ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా తయారు చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవంతో ఆయన అధైర్య పడలేదు. ఐఫోన్ 2007లో ప్రవేశపెట్టినపుడు 600 డాలర్ల ఫోన్ ఎవరు కొంటారని అనుకున్నా. ఆ తర్వాత అది సమాజంలో ఎంత ప్రభావం చూపిందో మీకు తెలుసు. మరొక ప్రముఖ వ్యక్తిని కూడా ప్రసావిస్తున్నా. అతని పేరు శ్రీధర్ వెంబు. జోహో కంపెనీని భారత ఫ్రీమియర్ ప్రాడక్ట్ డెవలప్ మెంట్ కంపెనీగా తయారుచేశారు. గ్రామాల్లో కూడా అద్భుతమైన పిల్లలు ఉన్నారు. ప్రాడక్ట్ డెవలప్ మెంట్ సెంటర్ తిరుపతి సమీపంలోని నా గ్రామంలో ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇప్పుడు అది మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్ట్ కంపెనీ. ఎంతోమంది స్పూర్తివంతమైన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మనకోసం, సమాజం కోసం అధునాతన ఆవిష్కరణలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద విండ్ మిల్ అయిన సుజ్లాన్ అనే సంస్థతో తో సెంటర్ ఆప్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసమే కాకుండా కరిక్యులమ్ తోపాటు ఇన్నొవేషన్ ప్రాజెక్టు ఇంక్యుబేషన్ చేసే ఆలోచనతో ఒప్పందం కుదుర్చుకున్నాం. భారతదేశంలో ఉన్న మేకిన్ ఇండియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఇన్నొవేటివ్ ఐడియాలను ఇంక్యుబేట్ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫెస్ట్ ఒక ఈవెంట్ కాదు… ఇదొక మూమెంట్. గౌరవ ప్రధాని మేక్ ఇండియా అని పదేపదే చెబుతున్నారు. సెల్ ఫోన్, టివిలు అన్ని కూడా చైనా, తైవాన్ లో తయారుచేస్తారు. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. మనమే వాటిని తయారుచేసే స్థాయికి ఎదగాలి.
ఇంక్యుబేషన్, ఇన్నొవేషన్ కు ప్రోత్సాహం
ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది మా విధానం. ఇందుకు అవసరమైన ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. వెనుకబడిన జిల్లా అనంతపురంకి కియా తెచ్చాం. అక్కడ ఉన్న పాలిటెక్నిక్, ఐటిఐలలో ఆటోమొటివ్ మొబిలిటీ ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఈరోజు ఆలోచన చేస్తున్నాం. కర్నూలును డ్రోన్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఇటీవల కేంద్రమంత్రి రాము ప్రకటించారు. డ్రోన్స్ ఇన్నొవేషన్ కి కావాల్సిన మెంటరింగ్ ను అక్కడ ఏర్పాటుచేయాల్సి ఉంది. కడప, చిత్తూరుకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. టీవీలు, సెల్ ఫోన్, కెమెరా మాడ్యూల్ తయారుచేసే సంస్థలు అక్కడ వచ్చాయి. ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ పరిశ్రమల ఏర్పాటుకు రిలయన్స్ తో ఒప్పందం చేసుకున్నాం. ఒక్కొక జిల్లాకు ఒక్కొక ప్రాధాన్యతతో ఎకో సిస్టమ్ ఏర్పాటుచేస్తున్నాం. అందుకు అవసరమైన ఇంక్యుబేషన్, ఇన్ ఫ్రాస్ట్చర్ క్రియేట్ చేస్తున్నాం.
*అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్*
రతన్ టాటా గారి గురించి నేను ఏం చెప్పినా తక్కువే. నిన్న ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా విగ్రహం ఆవిష్కరించా. రతన్ టాటా పేరుతో ఒక ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటుచేసి, అందుకు అనుబంధంగా నోడ్ లు ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. మీలాంటి సృజనాత్మక ఐడియాలు ఉన్నవారిని ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. సృజనాత్మకమైన ఐడియాలను ఇంక్యుబేట్ చేసేవారిని ప్రోత్సహించాలని జిఎడికి ఆదేశాలు ఇచ్చాం. అందుకు అవసరమైన ఎకనమిక్ యాక్టివిటీ ఎలా క్రియేట్ చేయాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తాం. ఈరోజు ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారికి క్యాష్ అవార్డులను ప్రభుత్వం అందిస్తుంది. మీ వద్ద ఉన్న ఐడియాలకు కార్యరూపమిచ్చే వరకు వదిలిపెట్టొద్దు.
అపజయం విజయానికి తొలిమెట్టు
అపజయం విజయానికి తొలిమెట్టు లాంటిది. అందుకు నేనే ఉదాహరణ. 2019లో నేను పోటీచేయాలని ఆసక్తి చూపిస్తే ఎక్కడ నుంచి పోటీచేస్తావని చంద్రబాబుగారు అడిగారు. ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి అడిగాను. అక్కడ 1985 తర్వాత టిడిపి గెలవలేదు. 2019లో తొలి ప్రయత్నంలో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయా. తొలుత బాధపడినా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. అయిదేళ్లు కష్టపడి పనిచేశా. ఇటీవల ఎన్నికల్లో ఎపి చరిత్రలో టాప్ -3 మెజారిటీ 91వేల మెజారిటీతో గెలిచా. ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రి మీరు ఏశాఖ ఆశిస్తున్నారని అడిగితే విద్యాశాఖ కావాలని అడిగా. కష్టమైన, సమస్యాత్మక శాఖ అన్నారు. అందుకే ఆ శాఖ కావాలని అడిగా. ఆశాఖలో సంస్కరణలు అమలుచేయడం చాలా కష్టమని చెప్పారు. అందుకే నేను చాలెంజ్ గా తీసుకొని పనిచేస్తున్నారు. సవాళ్లను స్వీకరించినపుడే మీలోని ప్రతిభ బయటకు వస్తుంది. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నయం లేదు. మీరు చేసే ప్రయాణంలో పది దెబ్బలైనా తగలొచ్చు. పట్టువదలకుండా పోరాడి అనుకున్నది సాధించాలి. అద్భుతమైన ఐడియాలను ఆవిష్కరించిన పాలిటెక్నిక్ విద్యార్థులను అభినందిస్తున్నా. అధునాతన ఆవిష్కరణలకు మద్దతు ఇస్తాం. రాష్ట్రంలో 8వేల కోట్ల విలువైన స్టార్టప్ కంపెనీ రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో రావాలని నేను కోరుకుంటున్నా. 1995 – 2004 నడుమ చంద్రబాబు సిఎంగా పనిచేసినపుడు డేర్ టు డ్రీమ్.. స్ట్రైవ్ టు ఎచీవ్ అని చెప్పారు. ఆయన మాటలను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని మంత్రి లోకేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.