కాప్రా, నాచారం సర్కిల్ కార్యాలయాల్లో బోనాల సందడి

Facebook
X
LinkedIn

అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ.. భక్తిశ్రద్ధలతో బోనాలు

కాప్రా :

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాప్రా, నాచారం సర్కిల్ కార్యాలయాల్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్రసాగర్, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానందన్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్లు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా మున్సిపల్ ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో బోనమెత్తి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజులు గజ్జెలు కట్టి వీరగోలలతో నృత్యాలు చేయగా, భక్తిగీతాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, పారిశుధ్య తదితర విభాగాల ఉద్యోగులు డప్పు చప్పుళ్లు, భజన బృందాల మధ్య అమ్మవారి పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ కళ్యాణి రాణి, సెక్షన్ ఆఫీసర్లు తుల్జా సింగ్, చైన్‌మాన్ శ్రీధర్, రాజు కుమార్, రాజు, రమేష్, గిరి, ఎల్లయ్య, నరేష్, శివాజీతో పాటు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.