ఉప్పల్ భగాయత్‌కు రూ.38.85 కోట్ల అభివృద్ధి వరాలు

Facebook
X
LinkedIn

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

డ్రైనేజీ, రోడ్లు, క్రీడా సముదాయానికి భారీ నిధుల మంజూరు

హైదరాబాద్, :

ఉప్పల్ భగాయత్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఏకకాలంలో ఎనిమిది కీలక అభివృద్ధి పనులకు రూ.38.85 కోట్ల నిధులు కేటాయించారు. ఈ మేరకు మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఇటీవల ఎంఎంసీ కార్యాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఉప్పల్ భగాయత్‌లో నెలకొన్న సమస్యలను తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసిన అనంతరం సీఎం సానుకూలంగా స్పందించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

భగాయత్ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో వరదనీటి పారుదల, మురుగునీటి సమస్యలు, అంతర్గత రహదారులు, పాదచారుల సౌకర్యాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం స్థానికులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేసే పనులకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు.

అదేవిధంగా యువతకు క్రీడా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో భగాయత్ ఫేజ్-1లో బేబీ పూల్, స్విమ్మింగ్ పూల్, ట్రిపుల్ జంప్, ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ వంటి ఆధునిక సౌకర్యాలతో మల్టీ స్పోర్ట్స్ అరేనా నిర్మాణానికి నిధులు కేటాయించడం విశేషమన్నారు.

ఈ సందర్భంగా నిధుల మంజూరులో ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డికి రజిత పరమేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.